74 వ రిపబ్లిక్​ డే వేడుకలకు సిద్ధమైన కర్తవ్య పథ్

74 వ రిపబ్లిక్​ డే వేడుకలకు సిద్ధమైన కర్తవ్య పథ్

కామన్ పీపుల్ థీమ్​తో నిర్వహణ.. కర్తవ్యపథ్​ రెడీ

న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలు గర్వించేలా 74 వ రిపబ్లిక్​ డే వేడుకలు నిర్వహించేందుకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసిన త్రివర్ణ పతాకాలు, పూలతో తయారుచేసిన రిపబ్లిక్ డే కటౌట్లతో దేశ భక్తి పెంపొందిస్తోంది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​కర్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. చీఫ్ గెస్ట్​గా ఈజిప్ట్  ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతా ఈఎల్ సిసి హాజరుకానున్నారు. ముఖ్యంగా కామన్ పీపుల్ థీమ్​తో ఈ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కర్తవ్య పథ్, సెంట్రల్ విస్టా నిర్మాణంలో కూలీలుగా పని చేసిన కార్మికులనువీవీఐపీలుగా గుర్తిస్తూ మొదటి వరుస సీట్లను కేటాయించింది. ఉదయం 10:30 నిమిషాలకు జాతీయ గీతం ఆలపిస్తూ త్రివర్ణ పతాకం ఎగురవేయడంతో రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇదే సమయంలో 105 ఎంఎం గన్స్ పేల్చడంతో పాటు 105 హెలికాప్టర్  యూనిట్‌కు చెందిన నాలుగు ఎంఐ–17 1వి/వి5 హెలికాప్టర్‌లు కర్తవ్య పథంలో ఉన్న ప్రేక్షకులపై పూలు కురిపిస్తాయి. అనంతరం త్రివిధ దళాల సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చక్ర అవార్డులు ప్రదానం చేస్తారు. తర్వాత త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఎన్​సీసీ, ఎన్​ఎస్ఎస్, ఢిల్లీ పోలీసుల పరేడ్ ప్రారంభం అవుతుంది. దేశ సత్తాను చాటేలా త్రివిధ దళాలు దేశ యుద్ధ ట్యాంకులు, అణ్వాయుధాలను ప్రదర్శిస్తాయి. అనంతరం దేశంలోని భిన్న సంస్కృతులను చాటేలా మొత్తం 23 శకటాలు కర్తవ్యపథ్​పై సందడి చేయనున్నాయి. విజయ్ చౌక్​లో మొదలయ్యే ఈ పరేడ్ రెడ్ ఫోర్ట్ వరకు సాగనుంది. చివర్లో  44 యుద్ద విమానాలు ఫ్లై పాస్ట్  విన్యాసాలతో వేడుకలు ముగుస్తాయి. 

ఆరు అంచెల భద్రత..

రిపబ్లిక్ డేలో బలంగా కర్తవ్య పథ్ ఏరియాలో దాదాపు ఆరు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్​తో పాటూ పారా మిలటరీ బలగాలు కాపు కాస్తున్నాయి. దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బంది మోహరింపు, 24 హెల్ప్ డెస్క్​లను ఏర్పాటు చేశారు. 150 సీసీ టీవీ కెమెరాలు, ఫేస్ రికగ్​నైజ్​ కెమెరాలను అమర్చారు. 
ఎన్ఎస్జీ, డీఆర్డీవో యాంటీ డ్రోన్ సిస్టమ్స్​ను ఏర్పాటు చేశాయి. బుధవారం సాయంత్రం నుంచే ఇండియా గేట్ రోడ్​ను మూసివేసారు.  కేవలం పరేడ్ పాస్, టికెట్​ఉన్న వారిని మాత్రమే పరేడ్ చూసేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.  దాదాపు 60 నుంచి 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  

23 శకటాలు.. 44 యుద్ధ విమానాలు..

ఈ సారి పరేడ్​లో 17 రాష్ట్రాలు, యూటీల శకటాలు, 6 కేంద్ర మంత్రిత్వ శాఖ శకటాలు సందడి చేయబోతున్నాయి. దక్షిణాది నుంచి ఏపి, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు అస్సాం, లడఖ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గుజరాత్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, దాద్రా నగర్ హవేలి ఉన్నాయి. చివర్లో వైమానిక దళానికి చెందిన 45 యుద్ధ విమానాలు, నేవి యుద్ద విమానం, ఆర్మీకి చెందిన 4 హెలికాప్టర్లు విన్యాసాలు చేయనున్నాయి. రాఫెల్, మిగ్–29, సుఖోయ్–30, జాగ్వర్, సీ–130, సీ–17, డోనియర్, డకోటా, ఎల్ సీహెచ్ ప్రఛండ్, అపాచ్​లు బాజ్, తిరంగ, తంగైల్, వజ్ రంగ్, గరుఢ, భీమ్, అంరీట్, త్రిశూల్ ఆకారంలో విన్యాసాలు చేయనున్నాయి. 

ఈసారి ప్రత్యేకతలివే..

  •     రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​కర్​లకు తొలి రిపబ్లిక్ వేడుకలు
  •     కామన్ పీపుల్ థీమ్​తో కర్తవ్య పథ్, సెంట్రల్ విస్టా కార్మికులు, రిక్షావాలాలు, పాలు, కూరగాయల విక్రయదారులకు ముందు వరుస సీట్లు కేటాయింపు
  •     తొలిసారి ఈజిప్షియన్ సాయుధ దళాల సంయుక్త బ్యాండ్ & మార్చింగ్ బృందం పరేడ్
  •     డిజిటలైజేషన్​ను ప్రోత్సహించేలా ఆన్ లైన్ లో పాస్ ల అమ్మకం, ప్రత్యేక ఏర్పాట్లు
  •     ఈ ఏడాది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రక్షణ వ్యవస్థలు ప్రదర్శన 
  •     ‘నారీ శక్తి’ థీమ్ తో వందే భారతం కార్యక్రమంలో ఎంపికైన 479 మంది కళాకారులతో మహిళాశక్తిని చూపేలా శాస్త్రీయ, జానపద రూపాల్లో ప్రదర్శన
  •     అర్జున్ ట్యాంక్, నాగ్ మిస్సైల్ వ్యవస్థ, మొబైల్ మైక్రో వేవ్, సిగ్నల్ వ్యవస్థ, రాడార్, 3 రుద్ర హెలికాప్టర్స్ ప్రదర్శనకు నేతృత్వం వహించనున్న మహిళా అధికారులు