‘కార్తికేయ 2’ మూవీ రివ్యూ

‘కార్తికేయ 2’ మూవీ రివ్యూ

నటీనటులు: నిఖిల్, అనుపమా పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ప్రవీణ్, ఆదిత్య మీనన్, శ్రీనివాస రెడ్డి, సత్య తదితరులు
సంగీతం: కాలభైరవ
డైలాగ్స్: కరణం మణిబాబు
నిర్మాణం: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
కథ, కథనం, దర్శకత్వం: చందు మొండేటి

‘కార్తికేయ’తో ఎనిమిదేళ్ల క్రితం మంచి విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పినా.. ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి, పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టింది. ఎట్టకేలకి ‘కార్తికేయ 2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఇది ఫస్ట్ పార్ట్ స్థాయిలోనే ఉందా లేక అంతకు మించి ఉందా? ఓసారి పరిశీలిద్దాం. 

కథేమిటంటే..
కార్తికేయ (నిఖిల్) ఓ హాస్పిటల్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రతి విషయాన్నీ సైంటిఫిక్‌గా ఆలోచించడం, మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించడం అతని నైజం. అయితే అతని తల్లి చెప్పిందని ఓ మొక్కు తీర్చుకోడానికి ద్వారక వెళ్తాడు. అక్కడ అతనికి ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. అనుకోకుండా ఎదురుపడిన ఓ ఆర్కియాలజిస్ట్ అతనికి ఓ బాధ్యతను అప్పగించి చనిపోతాడు. అయితే కార్తికేయ ఆయనని చంపేశాడని అపార్థం చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ కార్తికేయ వారికి చిక్కడు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకోవడంపై దృష్టి పెడతాడు. అసలా లక్ష్యం ఏమిటి, అతను దాన్ని సాధించాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..
హిట్ సినిమాకి సీక్వెల్ అనగానే కచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఏమాత్రం తగ్గినా మొదటి భాగంలా లేదంటూ ప్రేక్షకులు పెదవి విరిచేస్తారు. అందుకే ఎప్పుడూ ఫస్ట్ పార్ట్ ను మించి తీయాలనే దర్శకులు ప్రయత్నిస్తారు. అందుకే ‘కార్తికేయ 2’ విషయంలో దర్శకుడిపై చాలా పెద్ద బాధ్యత పడింది. ఆ బాధ్యతని అతను చాలా సక్రమంగా నిర్వర్తించాడు. ఒక ఆసక్తికరమైన పాయింట్‌ని తీసుకుని ఎంతో అందంగా రాసుకున్నాడు. మొదటి పార్ట్‌ కంటే గ్రాండ్‌గా దీన్ని తీర్చిదిద్దాడు. నిజానికి ఇలాంటి కాన్సెప్టులు కాస్త కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. దేవుడి చుట్టూ తిరిగే కథ. ఏమాత్రం తడబడినా ప్రజల కోపానికి గురి కావలసి వస్తుంది. ఆ విషయంలోనూ చాలా జాగ్రత్తపడ్డాడు చందు. మొదటి పార్ట్ లో చెప్పిన సుబ్రహ్మణ్యపురం కథతో మొదలు పెట్టి ద్వారకవైపు ప్రేక్షకుల్ని మళ్లించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మొత్తం జర్నీలో ఓ చక్కని మిస్టరీని పెట్టి, దాన్ని కనిపెట్టడానికి హీరో చేసే ప్రయత్నాలను థ్రిల్లింగ్‌గా మలిచి మెప్పించాడు. మలుపులు ఆకట్టుకున్నాయి. పాత్రలు ఎంటర్‌‌టైన్ చేశాయి. దాంతో సినిమా పూర్తయ్యేవరకు ప్రేక్షకుడికి నిరాశ కలగదు. మంచి సినిమా చూస్తున్నామనే ఫీల్‌తో స్క్రీన్‌కి కళ్లప్పగిస్తాడు.

ప్లస్ లు మైనస్‌లు..
సినిమా బాలేదు అని చెప్పేంత లేదు.. సినిమా ప్రారంభం కొంచెం స్లో అయ్యింది. ఓ ఇష్యూలో హీరో తాను ఇన్‌వాల్వ్ అయ్యి సాల్వ్ చేసేస్తాడు. అక్కడ కాస్త లాజిక్ మిస్సయ్యింది. అలా కాకుండా ఆ సమస్యకి హీరోని లింక్ చేసుకుంటే మరింత బాగుండేది. అయితే ఇలాంటివి కొన్నే.. ఇంటర్వెల్ సమయానికి కథలో వచ్చే మలుపు చాలా థ్రిల్ చేయడంతో ఆసక్తి పెరిగిపోతుంది. ఇక సెకండ్ ఆఫ్‌ని ఇంట్రెస్టింగ్‌గా పరుగెత్తించడంతో ప్రేక్షకుడికి ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ సినిమా స్థాయిని ప్రూవ్ చేశాయి. లొకేషన్ల దగ్గర్నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకు చాలా విషయాల్లో అద్భుతమైన క్వాలిటీని మెంటెయిన్ చేయడంతో ఓ చిన్న సినిమా చూస్తున్న ఫీలింగే కలుగదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు పడిన కష్టం, అతను పెంచుకున్న నాలెడ్జ్ కనిపిస్తుంటాయి. అవి చాలు కదా ప్రేక్షకుడిని సీటు నుంచి కదలకుండా చేయడానికి!

ఎవరెలా చేశారంటే..
నిఖిల్ మంచి ఆర్టిస్ట్ అనేది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే అతని నటనలోని మెచ్యూరిటీ లెవెల్స్ మరింత పెరిగాయనడానికి ఈ సినిమా నిదర్శనం. ప్రతి సీన్‌కీ ప్రాణం పోశాడు. తన ఎనర్జీతో, ఎక్స్ప్రెషన్స్ తో పాత్రకి ప్రాణం పోశాడనడంలో సందేహం లేదు. అనుపమకి పర్‌‌ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడతాయి. కాకపోతే గొప్పగా చెప్పుకునేంత పెద్ద క్యారెక్టర్ కాదు తనది. తల్లి పాత్రలో తులసి బాగా చేసింది. శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్‌‌ బాగా పండింది. ఇంత సీరియస్ సబ్జెక్ట్ కు అతని సెన్సాఫ్ హ్యూమర్ కాస్త రిలీఫ్ కలిగించింది. అనుపమ్ ఖేర్ గురించి వివరించాల్సిన అవసరం ఏముంటుంది! చిన్నదైనా పెద్దదైనా ఆయన నటన ఊహించని స్థాయిలోనే ఉంటుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదంటూ చెప్పే సీన్‌లో ఆయన ఎంత మేటి నటుడనేది మరోసారి అర్థమవుతుంది. ఆదిత్య మీనన్ ఫర్వాలేదనిపించాడు. ప్రవీణ్, సత్యల పాత్రల నిడివి మరికాస్త ఉంటే బాగుండేది.

ఇక టెక్నికల్ అంశాలను చూస్తే.. ఈ సినిమాలో పాటలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఉన్న ఒకటి రెండు కూడా లేకపోయినా పరవాలేదు. పాటలు పెట్టినందుకు అవి పెద్దగా ఆకట్టుకోలేదు కూడా. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కాలభైరవ డిసప్పాయింట్ చేశాడనిపిస్తుంది. మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే సినిమాకి బీజీఎం ప్రాణం. ఆ విషయంలో అనుకున్న స్థాయి కనిపించకపోవడం నిరాశపర్చే అంశమే కదా. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలకి బరువైన డైలాగ్స్ పడాలి. అవీ అర్థవంతంగా ఉండాలి. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయని విధంగా బ్యాలెన్స్ చేయగలగాలి. ఆ విషయంలో మణిబాబు సక్సెస్ అయ్యాడు. ఇక దర్శకుడిగా చందు మరోసారి తన సత్తా చాలాడు. కథనం పరంగా కాస్త ఎత్తూపల్లాలు ఉన్నప్పటికీ.. దేవుడిని, పురాణాల్ని, మిస్టరీని అన్నింటినీ ఇంత చక్కగా డీల్ చేయడం చిన్న విషయం కాదు కాబట్టి.. అతని ఎఫర్ట్ ను మెచ్చుకుని తీరాల్సిందే. ముఖ్యంగా క్లిషమైన కాన్సెప్ట్ అయినా కూడా బోర్ ఫీలవ్వకుండా ప్రేక్షకుల్ని కంప్లీట్‌గా ఎంగేజ్ చేయగలిగినందుకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. 

కొసమెరుపు: కార్తికేయ 2.. కట్టిపడేశాడు