
చెన్నై: కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ అత్యంత సన్నిహితుడు, టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా కార్యదర్శి మథియజగన్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. విజయ్ ఉద్దేశపూర్వకంగా సభకు ఆలస్యంగా వచ్చాడని.. అతడు లేట్‌గా రావడం వల్లే తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారని పోలీసులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించాడని ఆరోపించారు.
‘‘టీవీకే జిల్లా కార్యదర్శి మథియఝగన్ 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. కానీ విజయ్ వచ్చే వరకు సభకు దాదాపు 25 వేల మంది హాజరయ్యారు. బల ప్రదర్శన కోసమే విజయ్ ఉద్దేశపూర్వకంగా సభకు ఆలస్యంగా వచ్చారు. విజయ్ చెప్పిన సమయానికి కంటే నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో వేలాది మంది జనం ఎండలో నిలబడి అలసిపోయారు. ఈ సమయంలో విజయ్ రావడంతో అతడిని చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రిలో చేరారు" అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు వేలాయుధంపాలయం చేరుకున్న విజయ్.. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించాడని పోలీసులు ఆరోపించారు. కాన్వాయ్ సాయంత్రం 7 గంటలకు వేలుచామిపురం చేరుకుందని, అప్పటికి జనసమూహాన్ని నియంత్రించడం కష్టమైందని తెలిపారు. పరిస్థితి అదుపు తప్పుతుందని.. ప్రజలు ఊపిరాడక, గాయపడే ప్రమాదం ఉందని మతియఝగన్, బుషి ఆనంద్, సీటిఆర్ నిర్మల్ కుమార్‌లను పోలీసులు హెచ్చరించారని.. కానీ పోలీసులను మాటను లెక్క చేయలేదని పేర్కొన్నారు. పోలీసులు సహకరించినప్పటికీ టీవీకే నాయకులు జనసమూహాన్ని నియంత్రించడంలో విఫలమం కావడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు.