
తమిళనాడులో పెనుదుమారం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది స్టాలిన్ సర్కార్. ఈ ఘటనలో ప్రభుత్వం కుట్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా వీడియో రిలీజ్ చేసింది ప్రభుత్వం. కరూర్ ఘటనకు సంబంధించిన వీడియోలో టీవీకే కార్యకర్తలు తొక్కిసలాట సమయంలో కార్డన్‌ను బద్దలుకొట్టి పరిగెత్తుతున్నట్లు ఉంది. పెట్రోల్ బంక్, డ్రైనేజీ కాలువ ఉన్నందున టీవీకే ఎంపిక చేసుకున్న వేదిక సరైనది కాదని వాదిస్తున్నారు టీవీకే నాయకులు.
తొక్కిసలాట ఘటనపై విజయ్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము 10 ఏరియాలకు పర్మిషన్ ఇవ్వమని పోలీసులను అడిగామని వీడియోలో పేర్కొన్నారు విజయ్.
ర్యాలీలో 25 వేల మందికి పైగా జనం:
కరూర్ ర్యాలీలో జనసమూహం రెట్టింపు అవ్వడం వల్లే తొక్కిసలాటకు దారి తీసిందని.. జనాన్ని అంచనా వేయడంలో టీవీకే పొరపాటు చేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. 25 వేల మందికి పైగా జనం పాల్గొన్న ఈ ర్యాలీ నిర్వహణలో టీవీకే పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తోంది స్టాలిన్ సర్కార్. జనసమూహం ఎక్కువగా ఉండటం వల్ల విజయ్‌ను నిర్దేశించిన ప్రదేశానికి కొన్ని మీటర్ల ముందు ఆపమని పోలీసులు కోరారని, కానీ నిర్వాహకులు అంగీకరించలేదని కూడా ఆరోపించింది డీఎంకే.
"విజయ్ వెహికల్ కరూర్ లోని ర్యాలీకి నిర్ణయించిన స్థలం దగ్గరికి రాగానే జనసమూహం పెరిగిందని.. ప్రజలు ఒక్కసారిగా పక్కకు కదిలారని.. అందువల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపింది ప్రభుత్వం. మధ్యాహ్నం నుండి జనసమూహం పెరిగిందని, కొంతమంది ఉదయం గుమిగూడారని, దీనివల్ల తీవ్ర ఒత్తిడి, అలసటకు గురయ్యారని పేర్కొంది ప్రభుత్వం.
విద్యుత్ జనరేటర్ ఎన్‌క్లోజర్ వైపు భారీగా జనం గుమిగూడారని.. తరువాత, ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఫోకస్ లైట్లు ఆరిపోయాయని తెలిపింది ప్రభుత్వం.