పేమెంట్లను ఎగ్గొడుతున్న కార్వీ

పేమెంట్లను ఎగ్గొడుతున్న కార్వీ

మండిపడుతున్న క్లయింట్లు
ట్విటర్‌‌‌‌లో కూడా ఫిర్యాదుల వెల్లువ

ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్స్ షేర్లను అక్రమంగా తనఖా పెట్టడమే కాకుండా.. ఇన్వెస్టరలకు పేమెంట్లు కూడా సరిగ్గా జరపడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. షేర్లను అమ్మిన తర్వాత కూడా నెలల కొద్దీ తమ పేమెంట్లు జరుపకుండా అట్టే పెట్టుకుని ఉందని ఇన్వెస్టర్లు ఆరోపించారు. క్లయట్స్ చేస్తోన్న ఈ ఫిర్యాదులపై కార్వీ స్టాక్ బ్రోకింగ్‌‌ ఇంకా స్పందించలేదు. సెప్టెంబర్ 21న అమెరికాకు చెందిన ఒక సిటిజన్‌ రూ.3.8 కోట్ల విలువైన స్టాక్స్‌ను ఆఫ్‌ లోడ్ చేశారు. కానీ కార్వీ సీఈవో రాజీవ్ సింగ్ హామీ ఇచ్చినా.. పేమెంట్ ఇంకా జరుపలేదని, తమ ఫండ్స్ కోసం వేచి చూస్తున్నట్టు ఆయన చెప్పారు.

యూనివర్సిటీ వెంచర్ ఫండ్ చైర్మన్, యునిటస్ క్యాపిటల్‌కో ఫౌండర్ జియోఫ్ చెస్టర్ వూలీ రెండు నెలల క్రితం ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌‌లో 27 వేల షేర్లను రూ.3.8 కోట్లకు అమ్మారు. ఆయన మనీ ఇంకా అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ కాలేదు. షేర్లు అమ్మి, ఫండ్స్‌ను తన అమెరికా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయమని కార్వీకి చెప్పానని.. అయితే ఇంకా కార్వీ షేర్లను అమ్మిన ఫండ్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయలేదని వూలీ పేర్కొన్నారు. అంతకుముందు కూడా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌‌తో డీల్స్ జరిపానని, కానీ ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడు ఎదురుకాలేదని చెప్పారు. రూ.3.8 కోట్ల క్యాష్‌ తన డీమ్యాట్ అకౌంట్‌లో కనిపిస్తోందని, కానీ ఆ ఫండ్స్‌ను ట్రాన్స్‌ ఫర్ చేసుకోవడానికి లేదా ఇతర సెక్యూరిటీలను కొనడానికి వీలు పడటం లేదంటూ సెబీకి ఫిర్యాదు చేశారు. రాజీవ్‌‌ సింగ్‌‌ను డైరెక్ట్‌‌గా కాంటాక్ట్‌‌ అయిన తర్వాత కూడా తమ తరుఫున ఒక వ్యక్తిని కార్వీ స్టాక్ బ్రోకింగ్‌‌ ఆఫీసుకు పంపానని.. వారు ఒక డేట్‌ను చెల్లింపులు చేస్తామని అతనికి చెప్పినట్టు వూలీ పేర్కొన్నారు. కానీ అప్పటి నుంచి చెల్లింపుల డేట్‌ను వాయిదా వేస్తూనే ఉన్నారని తెలిపారు.