బరాబర్​ ఎన్నికల బరిలో టీడీపీ ఉంటది :  కాసాని

బరాబర్​ ఎన్నికల బరిలో టీడీపీ ఉంటది :  కాసాని

ఎన్నికల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం (టీడీపీ) పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. వదంతులను నమ్మొద్దని .. తప్పకుండా ఈ ఎన్నికల్లో టీడీపీ బరిలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ చాలా బలంగా ఉందన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని చెప్పారు.

టీడీపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందనే మాట అపోహ మాత్రమే అని చెప్పారు కాసాని. జనసేన అధినేత పవన్ కల్యాణ్​ తనను కలిశారని తెలిపారు. పొత్తుల విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట ఉంటుందన్నారు. ప్రజలు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు ప్రచారంలో ఉన్నారని చెప్పారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారని తెలిపారు.

ఈ మధ్యే రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిశామని చెప్పారు కాసాని. చంద్రబాబుకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, బరువు కూడా తగ్గారని వివరించారు. చంద్రబాబు అరెస్ట్​ తీరును నిరసిస్తూ.. తెలంగాణలో టీడీపీ నిరసనలు చేయొద్దనడానికి మంత్రి కేటీఆర్ ఎవరు..? అని ప్రశ్నించారు.