తెలంగాణలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ : కాసాని 

తెలంగాణలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ : కాసాని 
  • రాష్ట్రంలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ
  • త్వరలో అభ్యర్థుల లిస్ట్​, మేనిఫెస్టో రిలీజ్​: కాసాని 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో ఎన్నికల బరిలో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ‘ఈ సారి టీడీపీ పోటీ చేయదు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇస్తుంది..’ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన ఖండించారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కాసాని మీడియాతో మాట్లాడారు.

"ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే 30 మంది అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు దగ్గర చర్చించాం. మరో 87 మంది జాబితా సిద్ధంగా ఉంది. దీనిపై సర్వే చేస్తున్నాం. ఇతర పార్టీల నాయకులు టీడీపీలోకి  రావాలని చూస్తున్నారు. మాకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి, వలసలను ఆపాలనే దురుద్దేశంతో పోటీ చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. జనసేనతో పొత్తుపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని" కాసాని  స్పష్టం చేశారు. 

అభ్యర్థుల లిస్ట్‌‌‌‌‌‌‌‌తో బుధవారం చంద్రబాబుతో ములాఖత్‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో పార్టీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల లిస్ట్‌‌‌‌‌‌‌‌ రెడీగా ఉందని, బుధవారం చంద్రబాబును ములాఖత్ లో కలిసి ఫైనల్ చేస్తామని కాసాని తెలిపారు. రాష్ట్రంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాథం, జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, ముప్పిడి గోపాల్, భవనం షకీలారెడ్డి, పోలంపల్లి అశోక్, పి. సాయిబాబా పాల్గొన్నారు.