కాశ్మీర్​లో జవాన్ మిస్సింగ్...కారులో రక్తపు మరకలు

కాశ్మీర్​లో జవాన్ మిస్సింగ్...కారులో రక్తపు మరకలు

శ్రీనగర్: సెలవుపై ఇంటికొచ్చిన జవాన్ కనిపించకుండాపోయాడు. మార్కెట్​కు వెళ్లి తిరిగి రాలేదు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో జరిగింది. సైనికుడి కోసం భద్రతా బలగాలు భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. కుల్గాం జిల్లాలోని అచతల్ ఏరియాకు చెందిన జావేద్ అహ్మద్ వనీ (25) లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్​లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం లడఖ్ లో పోస్టింగ్. అయితే అతడు ఇటీవల సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి ఆదివారం డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లోకి సామాను తేవడానికి కారు తీసుకుని దగ్గర్లోని మార్కెట్ కు వెళ్లాడు. సాయంత్రం 6:30 గంటలకు వెళ్లిన జావేద్.. రాత్రి 9 అయినా తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు వెతుక్కుంటూ మార్కెట్​కు వెళ్లారు. అక్కడ కారు కనిపించింది. కానీ అందులో జావేద్ లేడు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు.. జావేద్ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కుల్గాం జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. కాగా, కారులో రక్తపు మరకలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టెర్రరిస్టులు జావేద్​ను కొట్టి, కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.  

నా కొడుకును విడిచిపెట్టండి: జవాన్ తండ్రి 

జావేద్​ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడిని విడిచిపెట్టాలని వేడుకుంటూ వీడియో విడుదల చేశారు. ‘‘మీకు దండం పెడ్త.. నా కొడుకును విడిచి పెట్టండి. వాడేమైనా తప్పు చేసి ఉంటే, నేను క్షమాపణ చెబుతున్నా. వాడిని ఉద్యోగం కూడా మాన్పిస్తాను. దయచేసి నా కొడుకును ప్రాణాలతో వదిలేయండి” అంటూ జావేద్ తండ్రి మహమ్మద్ అయూబ్ వానీ వేడుకున్నారు. ‘‘నా కొడుకు లడఖ్​లో పని చేస్తున్నాడు. ఇటీవలే ఇంటికొచ్చాడు. ఆదివారం డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం సాయంత్రం మాంసం తేవడం కోసం మార్కెట్​కు వెళ్లి కనిపించకుండాపోయాడు. నా కొడుకును కిడ్నాప్ చేశారు” అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, గతంలో సెలవుపై ఇంటికొచ్చిన కొంతమంది సైనికులను టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి చంపేశారు.