- నెలాఖరుకు మరో 10 వేలు పూర్తి
హైదరాబాద్, వెలుగు: గీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య కిట్లు వారి ప్రాణాలు కాపాడుతోంది. గత రెండేళ్ల క్రితం ఈ కిట్ల పంపిణీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్లో సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కిట్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత వికలాంగులుగా మారడం వంటి విషాదాలకు చెక్ పెట్టడమే ధ్యేయంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
తొలి విడతలో 40 వేల కిట్ల పంపిణీ
ప్రభుత్వం మొదటి విడత కింద మొత్తం 50,000 కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వివిధ జిల్లాల్లో 40,000 కిట్లను పంపిణీ చేశారు. మిగిలిన 10,000 కిట్లను ఈ నెల చివరి నాటికి పంపిణీ చేసేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కిట్ల పంపిణీ పెండింగ్ లో ఉందని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని కార్పొరేషన్ ఉన్నతాధికారి తెలిపారు. రక్షణ కిట్ అందించడమే కాకుండా, దానిని ఎలా ఉపయోగించాలనే దానిపై కిట్లను తయారు చేసిన కంపెనీ నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు.
మరో 20 వేల కిట్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం ఉన్న 50వేల కిట్ల పంపిణీ పూర్తయిన వెంటనే, రెండో విడత కింద మరో 20వేల రక్షణ కిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. తొలి విడత పూర్తికాగానే ఈ కొత్త కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గౌడ వృత్తిపై ఆధారపడి సుమారు లక్షా 80 వేల మంది గీత కార్మికులు జీవనం సాగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఒక్కరూ ప్రమాదాల బారిన పడకూడదనే ఉద్దేశంతో, రాష్ట్రంలో ఉన్న ప్రతీ గీత కార్మికుడికి దశలవారీగా ఈ కాటమయ్య రక్షణ కిట్‌ను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల గౌడ సంక్షేమ సంఘాలు, గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కిట్ వాడకం సేఫ్టీగా ఉంది
ఎన్నో ఏళ్ల నుంచి మోకుతో తాటి చెట్లు ఎక్కుతున్నా. నిత్యం భయం, ఆందోళన ఉండేది. రాష్ర్ట ప్రభుత్వం కాటమయ్య కిట్ ఇచ్చింది. దీని వాడకం చాలా బాగుంది. ఎంతో సేఫ్టీగా ఉంది. - శంకరయ్య గౌడ్ , గీత కార్మికుడు, వెగురుపల్లి, మానకొండూరు మండలం సబ్సిడీపై ఈవీ మోపెడ్ లు ఇవ్వాలని కోరుతున్నాం కాటమయ్య కిట్లు బాగా పని చేస్తున్నాయి. మా ఊర్లో 55 మందికి కిట్లు ఇచ్చారు. తాటిచెట్ల దగ్గరకు సైకిల్‌పై వెళ్లేందుకు ఇబ్బందవుతుంది. సబ్సిడీపై ఎలక్ర్టిక్ మోపెడ్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - రవీందర్ గౌడ్, గీత కార్మికుడు కేశపట్నం మండలం, కరీంనగర్ జిల్లా
