ప్రధాని పర్యటనపై  బీఆర్ఎస్ మౌనమెందుకు? : కవిత

ప్రధాని పర్యటనపై  బీఆర్ఎస్ మౌనమెందుకు? : కవిత
  • పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోయినా ఎందుకు ప్రశ్నించలే: కవిత
  • జాతీయ హోదా వచ్చేలా ప్రధాని మోదీకి రేవంత్​ లేఖ రాయాలి
  • సంజయ్ కొడుకుపై లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టపర్యటనపై బీఆర్ఎస్​ఎందుకు మౌనం వహిస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్) చీఫ్​కవిత ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్​ ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినా.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఉన్న వేదికను సంజయ్ పంచుకోవడం శోచనీయమని విమర్శించారు. ఏ ఆరోపణలు వచ్చినా ముందుగా నిందితులను దేశం దాటించటం బీజేపీకి అలవాటన్నారు.

సంజయ్ కుమారుడు దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలన్నారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్ల బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని, ఆ అమ్మాయి జీవితం నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పోస్ట్ చేసిన ఖాతాలను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.

జనగణనలో కచ్చితంగా ఓబీసీ కాలం పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కులంతో పాటు ఉపకులం, సామాజిక స్థితిగుతులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారుతున్నా మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని కవిత అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితే ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. మనకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. మనకు జరుగుతున్న అన్యాయంపై సీఎం మాట్లాడాలని, ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.  

మేము అధికారంలోకి రాగానే వాటర్​ కమిషన్​..

ఇరిగేషన్​ కోసం బీఆర్ఎస్ హయాంలో లక్షా 89 వేల కోట్లు   ఖర్చు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి లో పావు శాతం, కృష్ణాలో 50 శాతం నీళ్లను కూడా వాడుకోలేకపోతున్నామని వాపోయారు. కృష్ణా నదిలో  771 టీఎంసీలను ఆంధ్రావాళ్లు వాడుకున్నారని, మన వాటా మొత్తం వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరముందని  చెప్పారు. “మేము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతాం. వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం.

రాష్ట్రంలో నీటి నిర్వహణ అంతా వాటర్ కమిషనే చూసుకుంటుంది. సాగు యోగ్యమైన ప్రతి గుంటకు కూడా నీళ్లు ఇస్తాం. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్ ను నియమిస్తాం. మన రాష్ట్రంలో ఉన్న అనేక చిన్న నదులపై ఎక్కడికక్కడ వందేళ్లు బలంగా ఉండేలా గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేస్తాం” అని కవిత పేర్కొన్నారు.  

నీట్ పేపర్ లీక్ బాధాకరం..

నీట్ పేపర్ లీక్ కావటం బాధాకరమని కవిత అన్నారు. పది రూపాయల డైపర్ లీక్ కావడం లేదని.. కానీ, నీట్ పేపర్ మాత్రం లీక్ అవుతోందని అన్నారు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అయిన మన విద్యార్థులను కేంద్రం బాధపెడుతోందని విమర్శించారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీక్ కావడమేంటని ప్రశ్నించారు.