నేను బాధితురాలిని .. లిక్కర్ స్కామ్​తో నాకెలాంటి సంబంధం లేదు: కవిత

నేను బాధితురాలిని .. లిక్కర్ స్కామ్​తో నాకెలాంటి సంబంధం లేదు: కవిత
  • నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు 
  • ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసిన్రు 
  • నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది
  • నా ఫోన్ నెంబర్​ను టీవీల్లో డిస్ ప్లే చేసిన్రు 
  • ఈడీ, సీబీఐ కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైనే ఉన్నయ్
  • అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు 
  • చేయలేదు? సాక్షులను ఇప్పుడెట్ల ప్రభావితం చేస్తాను? అని ప్రశ్న.. మీడియాకు లేఖ విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కేసులో తాను బాధితురాలినని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్టుగా లిక్కర్ పాలసీ రూపకల్పనతో తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదని చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా స్పెషల్ జడ్జి ముందు తన ఆవేదనను చెప్పుకునేందుకు నాలుగు పేజీల లేఖను కవిత రాసుకొచ్చారు. 

అయితే కోర్టు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. రెండున్నరేండ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ తనను అదుపులోకి తీసుకుందని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసిందని అందులో కవిత ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టులో చెప్పిన ఈడీ.. కీలకమైన లోక్ సభ ఎన్నికల ముంగట తనను అరెస్ట్ చేసిందని అన్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడు సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానన్నారు. 

అవి తప్పుడు ఆరోపణలు.. 

మీడియా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని కవిత అన్నారు. ‘‘సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సమాంతరంగా రెండున్నరేండ్లు మీడియా విచారణ జరిగింది. నా మొబైల్ నెంబర్ ను టీవీ చానళ్లలో డిస్ ప్లే చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘నేను విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాను. దర్యాప్తు సంస్థల ముందు నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాను. దర్యాప్తు సంస్థలు అడిగిన బ్యాంకు వివరాలతో పాటు నా దగ్గర ఉన్న సమాచారం అందజేశాను. 

నా మొబైల్ ఫోన్లు మొత్తం ఇచ్చాను. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. వాంగ్మూలాలను తరచూ మారుస్తూ వస్తున్న సహ నిందితుల స్టేట్మెంట్స్ తో కేసును నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ ఖన్నా విచారణ సందర్భంగా ప్రస్తావించారని పేర్కొన్నారు. ‘‘కేసు విచారణలో భాగంగా గత రెండున్నరేండ్లుగా ఈడీ, సీబీఐ అనేక సోదాలు జరిపాయి. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాయి. చాలా మందిని అరెస్ట్ చేశాయి” అని చెప్పారు. 

బీజేపీలో చేరితే చాలు.. కేసు విచారణకు బ్రేక్ 

ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవేనని కవిత తెలిపారు. ఈ కేసుల్లోని నిందితులు బీజేపీలో చేరిన వెంటనే విచారణ ఆగిపోతున్నదని అన్నారు. ‘‘ప్రతిపక్ష నేతలను పార్లమెంట్ సాక్షిగా బీజేపీ లీడర్లు బెదిరించారు. ‘నోరు మూసుకోండి లేదంటే ఈడీని పంపుతాం’ అని బెదిరింపులకు గురిచేశారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి. 

న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందన్న ఆశతో ఉన్నాం” అని లేఖలో పేర్కొన్నారు. ‘‘కేసు దర్యాప్తుకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కొడుకు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.