మేడిగడ్డ కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్ బాధ్యత వహించాలి : మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్ బాధ్యత వహించాలి : మంత్రి ఉత్తమ్
  • కాళేశ్వరంపై పారదర్శ కంగాన్యాయ విచారణ: మంత్రి ఉత్తమ్​

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడానికి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​రావు ముమ్మాటికీ బాధ్యత వహించాలని  మంత్రి ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి అన్నారు.  ఎన్నికల హామీ మేరకే కాళేశ్వరంపై న్యాయ విచారణ పారదర్శకంగా నిర్వహించామని, తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. సోమవారం కేబినెట్​ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 2015లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వేమనపల్లిలో బ్యారేజ్ నిర్మించాలని సూచించినా, దానిని పట్టించుకోకుండా గత కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపట్టిందని, ఇది పూర్తిగా వ్యర్థమని నివేదిక తేల్చిచెప్పిందని అన్నారు. నాటి సీఎం, ఇరిగేషన్​ మంత్రికి అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కమిషన్ వెల్లడించిందని తెలిపారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి జీవో నంబర్లు 231, 232కు కేబినెట్​ ఆమోదం లేదని కమిషన్​రిపోర్ట్​ స్పష్టం చేసిందని, అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి ఆమోదం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నదని మంత్రి ఉత్తమ్ అన్నారు. 2019, 2021లో మేడిగడ్డకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అనుమతి ఇచ్చారని కమిషన్ తేల్చి చెప్పింది.

ఈ అవకతవకలకు నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్ లాంటి అధికారులు కూడా బాధ్యత వహించాలని నివేదికలో ఉందని మంత్రి తెలిపారు.  ప్రభుత్వం హామీతో తెచ్చిన రూ.87,449 కోట్ల అప్పులకుగానూ ఇప్పటికే రూ.29,737 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.64,212 కోట్ల మూలధనం, రూ.41,638 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. ఇది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అన్నారు.