పవర్ కమిషన్ రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

పవర్ కమిషన్  రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
  •  కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం
  •  నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు
  •  జస్టిస్ నర్సింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
  •  ప్రతివాదులుగా పవర్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ డిపార్ట్ మెంట్ 

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై వేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కమిషన్‌ను రద్దు చేయాలని రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్‌ కొనుగోలు జరిగిందని పునరుద్ఘటించారు. 

జస్టిస్‌ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో కమిషన్‌, జస్టిస్‌ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా ఉన్నారు. పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కమిషన్‌ ఇప్పటికే విచారణను ప్రారంభించి, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. గత సీఎం కేసీఆర్ కు కూడా ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు  జారీ చేసింది. దీనిపై స్పందించిన కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. అందులో కమిషన్ కు చట్టబద్ధత లేదని, జస్టిస్ నర్సింహారెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్.