
కరీంనగర్, వెలుగు: కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేరని, ప్రజలంతా కేసీఆర్ కు ఓటేసెందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణను కాపాడే శక్తి, తెలంగాణకు వెలకట్టలేని ఆస్తి కేసీఆర్ అని కొనియాడారు. కరీంనగర్ స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంగళవారం కార్యకర్తలు, బూత్ ఇన్‌చార్జిల సమావేశం నిర్వహించారు.
అంతకుముందు కరీంనగర్ సిటీలోని భగత్ నగర్, రామచంద్రపూర్ కాలనీ, గోదాంగడ్డ, శ్రీనగర్ కాలనీలో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, ఓట్ల శాతం పెంచే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని కోరారు. ఆంధ్రా నాయకులకు ఇదే చివరి ఎన్నిక అని, ఈ ఎన్నికలు కాగానే ఉమ్మడి రాజధాని గడువు తీరితే ఇక ఇక్కడకు రారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటేనని కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కి టికెట్ ఇప్పించింది బండి సంజయ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్వైస్చైర్మన్బోయినపల్లి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లోకి సంజయ్ వీరాభిమాని..
32వ డివిజన్ కట్టరాంపూర్ కు చెందిన బండి సంజయ్ వీరాభిమాని వెంకటేశ్మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాడు. వెంకటేశ్మాట్లాడుతూ సంజయ్ పై ఉన్న అభిమానంతో చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నానని, తనలాంటి వాళ్లను పట్టించుకునే పరిస్థితిలో సంజయ్ లేడన్నారు. కేవలం యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకుని అవసరం తీరాక వదిలేయడం సంజయ్ నైజం అని అన్నారు. అతనితోపాటు యువకులు నరేందర్, మహేశ్, ప్రవీణ్, తదితరులు పార్టీలో చేరారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే వెళ్లేది ఢిల్లీకే..
కొత్తపల్లి, వెలుగు : కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వెళ్లేది ఢిల్లీకేనని, ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్ధమే ఈ ఎన్నిక అని మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే మాయమైన బండి సంజయ్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదని, మరోసారి తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ జ్యోతి-, ఎంపీటీసీ గంగమ్మ-, లీడర్లు చందు, గణేశ్ గౌడ్, లక్ష్మయ్య, ఈశ్వర్‌గౌడ్, జనార్ధన్ పాల్గొన్నారు.