
నిర్మల్ : ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలో బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. “బీజేపీ సిగ్గులేని పార్టీ. పసుపు బోర్డుపై ఐదేళ్లు నాన్చారు. ఇన్నాళ్లూ మేం అడుగుతుంటే ఇవ్వలేదు. గెలిపిస్తే 3 రోజుల్లో మంజూరు చేయిస్తామని ప్రచారం చేస్తోంది. బీజేపీ దిగజారి.. నీచ రాజకీయాల చేస్తోంది. జనం వాస్తవాలు తెల్సుకుని బీజేపీని తొక్కుడు తొక్కి బీజేపీని పాతాళానికి పంపించాలి. ఏది ఎలా తెచ్చుకోవాలో టీఆర్ఎస్ కు బాగా తెల్సు.” అన్నారు.
మోడీ.. ఏవీ నువ్విస్తానన్న రూ.15లక్షలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ నేతలు సిగ్గు, లజ్జ లేకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ఫైరయ్యారు సీఎం కేసీఆర్. “బ్లాక్ మనీని పాతాళంలో ఉన్నా సరే తెస్తా… విదేశాల్లో ఉన్నా తెస్తా. ఇంటింటికీ రూ.15లక్షలు ఇస్తామన్నారు. మరి ఏమైంది.. 15 రూపాయలైనా ఇచ్చిన్రా. మళ్లీ ఏ ముఖం పెట్టి ఓట్లు అడుగుతున్నారు. 10 కోట్ల మందికి ఉద్యోగాలన్నారు. కోటిమందికైనా ఇచ్చారా. పాకిస్థాన్.. హిందువులు, ముస్లింలు అంటూ.. పనికిమాలిన పంచాయతీలు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. ప్రధానమంత్రి స్థాయి నాయకుడు దేశ ప్రజల ను విడదీసి మాట్లాడవచ్చునా. జనం సమస్యలు, పేదరిక నిర్మూలన, రైతుల సమస్యలపై మీకు బాధ్యత లేదా” అని ప్రశ్నించారు కేసీఆర్.
ఇలాంటి నాయకుల పాలన వల్లే… చైనాలో ఓ అధ్యయనం మనదేశం ఓ పిచ్చిదేశం అని రిపోర్టులో తేల్చిందన్నారు. “ఇండియాలో జనం అంతా కులం, మతం అని కొట్టుకుంటారు… వారు అభివృద్ధి, టెక్నాలజీపై దృష్టి పెట్టరు… మన వ్యాపారాలకు ఏ ఇబ్బంది లేదు” అని చైనాలో ఓ సర్వే తేల్చిందన్నారు కేసీఆర్.
“కశ్మీర్ లాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి నీరు రావాలి. ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆదిలాబాద్ నిజంగా కశ్మీర్ లా మారుతుంది. జూన్ నెల తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం. అటవీ భూముల విషయంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం రాబోతుంది. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది” అని సీఎం కేసీఆర్ చెప్పారు.