అలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్ర

అలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్ర

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎండిన పంటపొలాల పరిశీలన, రోడ్డు షోల్లో పాల్గొననున్నారు కేసీఆర్. ఈ మేరకు రోడ్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది.  అలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.  ఉదయం 11 వరకు పొలం బాట కార్యక్రమం.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2- లేదా 3 చోట్ల రోడ్డు షోల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రెడీ చేశారు.  

సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.  రూ.500 బోనస్ కోసం పంట కల్లాల దగ్గర పోరాటాలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ కు  అనుకూలంగా మారుతున్నాయని నేతలు, కార్యకర్తలతో కేసీఆర్  చెప్పారు.  అందరూ సమన్వయంతో పని చేయాలని తెలిపారు.  

 తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్  బీఫామ్‌లు అందజేశారు.  ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.    ఈ స‌మావేశానికి ఎంపీ అభ్యర్థుల‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజ‌ర‌య్యారు.