కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ గొంతెత్తిన కళకారులు

కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ గొంతెత్తిన కళకారులు

కరీంనగర్, వెలుగు: కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ పాటల రూపంలో కళాకారులు, గాయకులు గొంతెత్తారు. తమ ఆటపాటలతో కదం తొక్కారు.  కరీంనగర్ కళాభారతిలో ఆదివారం ‘పాటల పల్లకి’ పేరిట 12 గంటల నిర్విరామ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. కార్యక్రమ కన్వీనర్, కవి, గాయకుడు నేర్నాల కిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని తాము భుజాన మోస్తే..  బీఆర్ఎస్ తమకు అన్యాయం చేసిందని ఆరోపించాడు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తెలంగాణ ఉద్యమ కళాకారులను గుర్తించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 

టీ పీసీసీ సాంస్కృతిక విభాగం చైర్మన్ రఘు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ కళాకారులను గుర్తిస్తుందని తెలిపారు. గద్దర్ పేరిట సినిమా అవార్డు ఇవ్వడంతో పాటు, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, తేలు విజయ, పల్లె నర్సింహతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన వందలాది మంది కళాకారులు హాజరై తమ ఆటపాటలతో అలరించారు. మాజీ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ నిజమైన కళాకారులకు అన్యాయం చేసి అనర్హులకు సారథిలో ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించారు. ఒగ్గు డోలు బృందాలు, డప్పు కళాకారులు, జానపద గాయకులు పాల్గొన్నారు.