వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది ?  షర్మిల

వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది ?  షర్మిల

జగిత్యాల జిల్లా:  కేసీఆర్ వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దక్షిణ భారతంలో కాశీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడకు ఏటా రూ.100 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయంపై ఉన్న ప్రేమ.. వేములవాడ రాజన్నపై లేదా అని నిలదీశారు. 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 195వ రోజు కథలాపూర్ మేడిపల్లి మండలాల్లో కొనసాగుతోంది. ఇవాళ ఎకిన్ పూర్  నైట్ క్యాంప్ నుంచి  పాదయాత్ర ప్రారంభించిన షర్మిల కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

యాదాద్రికి 3 వేల కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్... వేముల వాడ రాజన్నకి కనీసం 200 కోట్లు ఇవ్వలేకపోయారని షర్మిల విమర్శించారు. యాదాద్రి లో రియల్ ఎస్టేట్ ఆదాయం వస్తుంది కాబట్టి ఖర్చు చేశారని.. వేములవాడలో రియల్ ఎస్టేట్ లేదని పెట్టలేదా ? అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెన్నమనేని రమేష్ కాదు...జర్మనీ రమేష్.. ఈయన వేములవాడకి ఎమ్మెల్యే కాదు..జర్మనీకి ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. 

మిడ్ మానేర్ బాధితులకు సిగ్గు లేకుండా సీఎం సారీ చెప్పడమా..?

మిడ్ మానేర్ బాధితులకు సీఎం సిగ్గులేకుండా సారీ చేప్పారని వైఎస్ షర్మిల విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బతికుంటే సూరమ్మ ప్రాజెక్టు వెంటనే పూర్తయ్యేదని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు.  సూరమ్మ ప్రాజెక్ట్ వెంటనే పూర్తి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.ఎన్నికలకు ముందు మంత్రి హరీష్ రావు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లాడట.. 500 కోట్లు ఇచ్చామని చెప్పారట.. ఎక్కడకు పోయాయి నిధులు ? అని షర్మిల ప్రశ్నించారు. నియోజకవర్గానికి వైఎస్సార్ ఎంతో చేస్తే.. కేసీఅర్ చేసిందంతా మోసమే అన్నారు.

మిడ్ మానేరు కింద 12 గ్రామాల ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రాజెక్ట్ కింద ఆస్తులు ఇచ్చిన ప్రజల త్యాగం వెలకట్టలేనిదన్నారు. నష్టపరిహారం కింద 5.04 లక్షలు ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యింది..? సిగ్గు లేకుండా సారీ చెప్పిన ముఖ్యమంత్రిని ఏమనాలి..? డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి.. అవి కూడా ఇవ్వకుండా మోసం చేశారని షర్మిల విమర్శించారు. 

ఇక్కడ ఎమ్మెల్యే ఎలాగూ ఉండడు కాబట్టి పక్కనే ఉన్న సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ వేములవాడను దత్తత తీసుకోవచ్చు కదా ? అని ప్రశ్నించారు. పక్కనున్న నియోజకవర్గాన్ని పట్టించుకోని కేటీఆర్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మునుగోడును దత్తత తీసుకుంటానని చెబుతున్నారని షర్మిల ఆరోపించారు. గతంలో కొడంగల్ దత్తత అన్నారు..అటువైపు కూడా పోలేదు.. ఇప్పుడు మునుగోడు దత్తత అని కొత్త డ్రామా మొదలుపెట్టారని అన్నారు. ఒక నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలని అంటే దత్తత తీసుకోవాలా..? అని షర్మిల ప్రశ్నించారు.