‘ కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ’ పుస్తకావిష్కరణ

‘ కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ’ పుస్తకావిష్కరణ

ఓయూ, వెలుగు : అవకాశవాదుల చేతుల్లో చిక్కి ఆగమైన తెలంగాణను దక్కించుకునే దిశగా తెలంగాణవాదులు, మేధావులు, విద్యార్థులు కృషి చేయాలని  టీజేఎస్​ రాష్ర్ట అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం పేర్కొన్నారు. రాష్ర్టాన్ని కుటుంబ పాలనకే అంకితం చేసిన బీఆర్ఎస్​ పార్టీని గద్దె దించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్​కాలేజీ సెమినార్​ హాల్​ లో   ప్రొఫెసర్​ మంద అశోక్​కుమార్ రాసిన ‘ కేసీఆర్​చేతిలో ఆగమైన తెలంగాణ’  పుస్తకావిష్కరణ  బుధవారం జరిగింది. తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ స్టేట్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ అధ్యక్షతన  జరిగిన కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా  ఆంధ్ర పాలకుల కంటే దారుణంగా కేసీఆర్ పాలన సాగిస్తూ  తెలంగాణ మేధావులు, పౌర సమాజం, విద్యార్థులపై నిర్బంధం పెడుతున్నాడని మండిపడ్డారు.  ధనిక రాష్ర్టంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలైందని,  అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.  రాష్ర్ట అభివృద్ధి తిరోగమన దిశలో సాగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె. వీరస్వామి, ఎస్ ప్రేమ్ కుమార్, సాంబ లక్ష్మయ్య, విద్యార్థి సంఘ నేతలు నిజ్జన రమేష్ ముదిరాజ్, ఎస్ నాగేశ్వరరావు , జంగిలి దర్శన్, ఎన్ . సుమంత్, రవినాయక్ పాల్గొన్నారు.