ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి : సంజయ్​

ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి : సంజయ్​
  •      ఫోన్ ​ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే దారుణం 
  •     ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికీ అర్హుడు కాదు 
  •     కేసీఆర్, కేటీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు :  ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంలో గతంలో తాను చెప్పినట్టే ప్రతిపక్షాలపై కేసీఆర్​ సైబర్​ దాడి చేసినట్టు తేలిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సృష్టించినట్టు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్​తో తేలిపోయిందని సోమవారం ఒక ప్రకటనలో సంజయ్​ చెప్పారు. 

రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్​మెంట్​ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై, ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్​ను ఉపయోగించుకున్నట్టు అర్థమవుతోందన్నారు. బీజేపీ సానుభూతిపరులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను ఫోన్​ ట్యాపింగ్ తో టార్గెట్ చేశారని ఆరోపించారు. 

ప్రాథమిక హక్కులను కాలరాశాడు

రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవి చేపట్టిన కేసీఆర్.. అదే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించారని, ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ ద్రోహమేనని సంజయ్​ అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తమకున్న ప్రత్యేకమైన హక్కులను కాపాడటం దేవుడెరుగు, దేశ పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్​తో కాలరాసిన నీచుడు కేసీఆర్ అని ఫైర్​ అయ్యారు. 

ఎమ్మెల్యేగానే కాదు.. భవిష్యత్తులో రాజ్యాంగ బద్ధంగా ఏ పదవీ చేపట్టేందుకు కేసీఆర్​ అర్హులు కారని స్పష్టం చేశారు. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినా.. అదే పనిచేస్తారని అన్నారు. వెంటనే కేసీఆర్​పై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని కోరారు.  

కేసీఆర్​ను ఎందుకు అరెస్ట్​ చేయట్లే?

ఫోన్ ట్యాపింగ్​లో కేసీఆర్ పాత్ర ఉన్నట్టు ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సంజయ్​ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే చాన్స్​ ఉందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశంపై సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్​ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా తగిన చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్​ను కోరారు.