ప్రజల్లో తండ్రీకొడుకుల గ్రాఫ్​ పడిపోతోంది

ప్రజల్లో తండ్రీకొడుకుల గ్రాఫ్​ పడిపోతోంది

కేసీఆర్​ ధ్యాసంతా కమీషన్లపైనే 

ప్రజల్లో తండ్రీకొడుకుల గ్రాఫ్​ పడిపోతోంది
ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నరో వాళ్లకే అర్థం కావట్లే
కేంద్రం నిధులివ్వట్లేదని అసత్య ఆరోపణలు


మంచిర్యాల, వెలుగు: జనాన్ని కేసీఆర్​ మర్చిపోయిండని, ఆయన ధ్యాసంతా ప్రాజెక్టుల రీ డిజైనింగు, కమీషన్లమీదే ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. వరంగల్ సభలో ప్రధాని నరేంద్రమోడీని కేటీఆర్​ ఇష్టారీతిగా తిట్టడం  సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదని టీఆర్​ఎస్​ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో రూ.5 వేల కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రమే పెట్టిందని, వేల కోట్లతో నేషనల్​హైవేలు నిర్మిస్తోందని చెప్పారు. ప్రజల్లో కేసీఆర్, కేటీఆర్ గ్రాఫ్ పడిపోతోందని, ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదని అన్నారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి పుష్కరస్నానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారి వచ్చిన ప్రాణహిత పుష్కరాలకు కేసీఆర్​ నిధులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలకు హాజరయ్యేందుకు కూడా ఆయనకు తీరిక లేదా అని ప్రశ్నించారు. రూ.35 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైనింగ్​ పేరుతో రూ.లక్షా 25 వేల కోట్లు చేసి కమీషన్లు దండుకున్నాడని ఆరోపించారు. సెక్రటేరియట్ నిర్మాణ​ బడ్జెట్​ను రూ.400 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచాడన్నారు. ప్రాణహిత పేరును మరిపించడానికే పుష్కరాలకు ఫండ్స్​ ఇవ్వలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పుష్కరాలకు అప్పటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డితో పోరాడి రూ.10 కోట్లు రిలీజ్​చేయించామని వివేక్​ వెంకటస్వామి చెప్పారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్​, లీడర్లు నగునూరి వెంకటేశ్వర్లు, విశ్వంభర్​రెడ్డి, శ్రీనివాస్, సుశీష్​కుమార్​ 
ఉన్నారు. 
బీజేపీలో చేరికలు..
చెన్నూర్​ మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన పలువురు వివేక్​ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.