
అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు పారదర్శక సేవలు అందేలా కొత్త అర్బన్ పాలసీ ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్బన్ పాలసీలో భాగంగా కొత్త మున్సిపల్ చట్టం, కొత్త కార్పొరేషన్ల చట్టం, హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని, హెచ్ఎండీఏతోపాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని సూచించారు. అలాగే కొత్త రూరల్, రెవెన్యూ పాలసీ కూడా రూపొందించాలని సూచించారు. కొత్త చట్టాల డ్రాఫ్ట్‌లను రెండు మూడ్రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ బిల్లులను ఆమోదించుకునేందుకు త్వరలోనే అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపకల్పనపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
చట్టాల ప్రకారమే పాలన
‘‘అవినీతికి, అక్రమ కట్టడాలకు ఏమాత్రం ఆస్కారం లేనివిధంగా, పచ్చదనం–పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడేలా కొత్త చట్టాలు ఉండాలి. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించాం” అని సీఎం చెప్పారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల పాత్ర పోషించేలా నిబంధనలు పెడతామన్నారు. ఇష్టం వచ్చినట్లు నిధులు ఖర్చు చేయకుండా, ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం మాత్రమే నిధులు వెచ్చించాలని వివరించారు. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలని, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలని ఆకాంక్షించారు. ఓ పద్ధతి ప్రకారం నగర–పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలని దిశానిర్దేశం చేశారు.
పంచాయతీరాజ్ సమ్మేళనాలు
తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు, గ్రామాల వికాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించేందుకు రాష్ర్టంలోని 4 ప్రాంతాల్లో పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహిస్తామని చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్ పర్సన్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, సీఈవోలను సమ్మేళనాలకు ఆహ్వానిస్తామని చెప్పారు.
ఐదేండ్లలో రూ.35 వేల కోట్లు
ఏడాదికి రూ.7 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.35 వేల కోట్లను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ నిధులను సమర్థంగా వాడుకునేలా స్థానిక సంస్థలు తయారు కావాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే దానిపైనా సమ్మేళనాల్లో చర్చిస్తామన్నారు. తర్వాత అధికారులతో100 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. స్క్వాడ్‌లు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో 3 నెలల్లో మార్పు కనిపించాలన్నారు. కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్‌లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ ఎస్.కె. జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఏయూడీ డైరెక్టర్ శ్రీదేవి, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.