
- కేంద్రం 50శాతం ఎక్కువ కొనుగోలు చేసింది
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
నిర్మల్ జిల్లా: కమీషన్ల కోసమే సదర్మాట్ ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసం ధాన్యం రగడ తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. ఖానాపూర్ లో సోమవారం బీజేపీ రైతు సదస్సు జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావ్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, రాథోడ్ రమేష్, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా 30శాతం అధికంగా ధాన్యం సేకరించే కేంద్రం.. తాజాగా కొత్త 50శాతం ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. మేఘా సంస్థ అధిపతి కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే పెద్ద ధనికున్ని చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన అన్నారు. కేసీఆర్ గంటకు ఒక మాట మాట్లాడుతూ తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల సొమ్మును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వరి వేయొద్దన్నా కేసీఆర్... నీ ఫామ్ హౌస్ లో ఎందుకు పండిస్తున్నావ్ అని ప్రశ్నించారు. ప్రధాని సుపరిపాలన వల్ల ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన రైతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చారని తెలిపారు. కోవిడ్ సమయంలో పేదలకు ఉపయోగపడే ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేయలేదన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు కంకణ బద్ధులు కావాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
ఈ మున్సిపాలిటీ ఎప్పటికి బాగుపడుతుందో..
కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు