ఇప్పుడేం చేద్దాం?.కవిత తాజాకామెంట్లతో కేసీఆర్​ అంతర్మథనం

ఇప్పుడేం చేద్దాం?.కవిత తాజాకామెంట్లతో కేసీఆర్​ అంతర్మథనం
  • పార్టీకి భారీ డ్యామేజీ జరిగిందనే అంచనాలు
  • దయ్యాలు, కోవర్టుల ఎపిసోడ్​ తర్వాత కేటీఆర్​ను ఫామ్​హౌస్​కు పిలిపించుకున్న కేసీఆర్​
  • కవితను పిలవకుండా.. రాయబారులతో మంతనాలు
  • కేటీఆర్​ను పిలిచినట్టే కవితనూ పిలిస్తే బాగుండేదంటున్న నేతలు
  • తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ
  • కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్​ఎస్​లో మరింత హీట్​

హైదరాబాద్​, వెలుగు: కేటీఆర్​, హరీశ్ ​రావు లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన కామెంట్లు బీఆర్​ఎస్​లో కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగినట్లు హైకమాండ్​ అంచనాకొచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామన్న అంతర్మథనంలో కేసీఆర్  ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీ సిల్వర్​ జూబ్లీ వేడుకలకు సంబంధించి కవిత లేఖ రాయడం, ఆ లేఖ లీక్​ అవడంతో మొదలైన పంచాయితీ.. ఇప్పుడు కీలక నేతలపైనే ఆరోపణలు చేసే వరకు వెళ్లింది. 

అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఎయిర్​పోర్టులో కవిత.. ‘‘కేసీఆర్​ చుట్టూ దయ్యాలున్నా’’యని వ్యాఖ్యానించడం,  కౌంటర్​గా కేటీఆర్​.. ‘‘బీఆర్​ఎస్​లో రేవంత్​ కోవర్టులు’’న్నారని అనడంతో  వివాదం మరో స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్నా తన తండ్రి కేసీఆర్​ పిలిచి మాట్లాడకపోవడం వల్లే కవిత మనస్తాపం చెందారని, ఈ క్రమంలోనే ఆమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారనే చర్చ పార్టీలో నడుస్తున్నది. 

కేటీఆర్​ను పిలిచి.. కవితను పిలువలే!

ఈ నెల 23న అమెరికా నుంచి ఎయిర్​పోర్టులో దిగిన వెంటనే కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్​ను ఫామ్​హౌస్​కు పిలిపించుకుని కేసీఆర్​ మాట్లాడారు. ఆ అంశంపై ఇంకెవరూ మాట్లాడొద్దని సూచనలు చేశారు. ఇప్పటికే పార్టీకి డ్యామేజీ జరిగిందని, మళ్లీ లేనిపోనివి మాట్లాడితే మరింత నష్టం జరుగుతుందని కేటీఆర్​కు కేసీఆర్​ సూచించినట్టుగా వార్తలు వచ్చాయి.  కొడుకు కేటీఆర్​ను ఫామ్​హౌస్​కు పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్​.. కూతురు కవితను మాత్రం పట్టించు కోలేదు. 

కవితను కూడా పిలిపించుకొని, ఆమెను బాధించిన విషయాలేంటో  కేసీఆర్​ అడిగి తెలుసుకుంటే బాగుండేదన్న చర్చ బీఆర్​ఎస్​ వర్గాల్లో జరుగుతున్నది. వాస్తవానికి కవిత కూడా తన తండ్రి పిలుపు కోసం ఎదురుచూశారని పలువురు నేతలు చెప్తున్నారు. తండ్రి నుంచి పిలుపు వస్తుందన్న ఉద్దేశంతోనే.. సరస్వతి పుష్కరాలకు వెళ్లాల్సి ఉన్నా కూడా టూర్​ను ఆమె రద్దు చేసుకున్నారన్న ప్రచారమూ జరిగింది. 

కవిత అంతగా ఎదురు చూసినా కేసీఆర్ ​మాత్రం పిలవకపోగా.. ఇద్దరు రాయబారులను పంపి మంతనాలు జరిపించడమూ ఆమెను మరింతగా బాధించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్​ పిలిచి కనీసం బుజ్జగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమోనన్న డిస్కషన్​ గులాబీ శ్రేణుల్లో నడుస్తున్నది. 

బుజ్జగింపులా.. చర్యలా..

కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్​ ఎలా స్పందిస్తారన్న దానిపైనే పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏకంగా పార్టీ హైకమాండ్​నే ప్రశ్నిస్తూ ఆమె కామెంట్లు చేశారు. ఈ క్రమంలో కవితపై క్రమశిక్షణ చర్యలు తీసు కుంటారా.. లేదంటే పిలిపించుకుని బుజ్జగిస్తారా.. అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు ఇంత జరుగుతున్నా కేసీఆర్​ ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలూ కేడర్​లో ఉత్పన్నమవుతున్నాయి.

ఇంటి గుట్టు రచ్చకు..

ఎయిర్​పోర్ట్​లో కవిత చేసిన ‘దయ్యాలు’ కామెంట్స్​పార్టీకి కొంతవరకే డ్యామేజీ చేశాయి. కానీ, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఊహించని డ్యామేజీ జరిగిందని సీనియర్లు చెప్తున్నారు. కవిత ఎయిర్​పోర్ట్​లో చేసిన కామెంట్స్ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లా డుతూ..​‘రేవంత్ కోవర్టు’ అంటూ రెచ్చగొట్టడం, కేసీఆర్​ నుంచి పిలుపురాకపోవడంతో ఆమె లోలోపలే రగిలిపోయినట్లు తెలుస్తున్నది. 

తాను కాంగ్రెస్​లో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నా, బీఆర్ఎస్​ నేతలు ఖండించకపోవడంతో కవిత.. ఒక్కసారిగా బరస్ట్​ అయ్యారని నేతలు అంటున్నారు. కవిత అమెరికా టూర్​లో ఉండగా ఆమె లేఖ లీక్​ అయి సంచలనం రేపితే.. ఇప్పుడు తన అన్న కేటీఆర్​ అమెరికా టూర్​లో ఉన్నప్పుడు ఆమె అంతకుమించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరిగాయంటూ ఇంటిగుట్టు బయటపెట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పార్టీకి మరింత డ్యామేజీ చేశాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.