
- వీలైతే ప్రత్యామ్నాయం.. లేదంటే సమదూరం
- మంత్రులు, ఎంపీలతో సీఎం సుదీర్ఘ సమాలోచనలు
- కేంద్రం తీరును ఎండగట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నిలబెట్టే అభ్యర్థులకు సమదూరం పాటించాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. మరోసారి బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర పార్టీల సీఎంలు, అధ్యక్షులతో చర్చించి ప్రాంతీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై నిర్ణయం తీసుకుంటామని, ఒకవేళ అది కుదరకపోతే రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉందామని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం మంత్రులు, మండలి చైర్మన్, స్పీకర్, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో రాత్రి 10.50 గంటల వరకు కొనసాగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపైనే ఎక్కువ సేపు చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలపై తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలతో పాటు వివిధ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చల సారాంశాన్ని కేసీఆర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఈ నెలలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్‌గా ఉన్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అసూయ పెంచుకుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నదని మండిపడ్డట్టు తెలిసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని తుంగలో తొక్కుతూ రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు కేంద్రం అడ్డం పడుతున్నదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన కేంద్రం ఇంతకు ముందు లేదని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన ఘటనలను రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ ఉపయోగించుకుంటున్నదని, ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, వీటిని ఎండగట్టడానికి అసెంబ్లీనే ప్రధాన వేదిక అని పేర్కొన్నారు.
కనీసం వారం, పది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు దీటైన సమాధానాలు చెప్తామని ఆయన సూచించారు. ఈమేరకు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని మంత్రులను ఆదేశించారు.
దేశ రాజకీయాల్లో పాత్ర పోషిస్తా
కేంద్రంలో గుణాత్మక మార్పు దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని, ఈ దిశగా వివిధ రంగాల నిపుణులతో పాటు రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుగుతాయని కేసీఆర్ తెలిపారు. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన పార్టీలు ప్రజల కేంద్రంగా పాలన సాగించలేదన్నారు. ఈ పరిస్థితి నుంచి దేశంలోని ప్రజలను బయట పడేయడంతో పాటు తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ దేశంలో ప్రజలకు అందడమే ఎజెండాగా దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తానని ఆయన చెప్పినట్టు తెలిసింది. కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రానికి నిధుల కొరత తలెత్తుతోందని, ఈ పరిస్థితుల్లో రైతుబంధు చెల్లింపుల్లో కొంత ఆలస్యమవుతున్న మాట నిజమేనని ఆయన చెప్పినట్టు సమాచారం. వారం, పది రోజుల్లో ఈ పథకం కింద రైతులకు నగదు పంపిణీ ప్రారంభించి నెలాఖరు వరకు పూర్తి చేసేలా నిధుల కూర్పు జరుగుతోందని చెప్పినట్టు తెలిసింది. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.