
- బీఆర్ఎస్‌ను పొలిమేర దాకా తరమాలి
- రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించిండు: రేవంత్ రెడ్డి
- అబద్ధపు హామీలతో పదేండ్లుగా టైంపాస్ చేస్తున్నరు: మాణిక్ ఠాక్రే
- ప్రజలకు తీరని నష్టం జరిగింది: భట్టి విక్రమార్క
- గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ ‘ప్రజా కోర్టు’
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రోజూ ప్రజా చార్జిషీట్ రిలీజ్ చేయాలని నిర్ణయం
- నెల రోజుల్లో 75 లక్షల కుటుంబాలను కలిసేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, అభివృద్ధి అనేవి భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు. ప్రజాకంటక కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టే బాధ్యతను యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ప్రచార కమిటీ మధుయాష్కీ ఆధ్వర్యంలో ‘ప్రజా కోర్టు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా కోర్టులో జడ్జిగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్లను నేతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులు, ఉద్యమకారుల ఆత్మబలిదానాలను గౌరవించి తెలంగాణలో శాంతి ఏర్పడాలని, అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ చనిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా.. తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేసింది” అని చెప్పారు. ‘‘ఉద్యమం టైమ్‌లో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను ఇచ్చారు. వాటిని రాజకీయ ఇంధనంగా వాడుకుని కాలరాశారు. అందుకే 4 కోట్ల ప్రజల తరఫున బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ ప్రజాకోర్టును ఏర్పాటు చేస్తున్నాం. కేసీఆర్ కుటుంబ దోపిడీ, వారి అన్యాయాలపై ప్రజాకోర్టులో చార్జిషీట్లను దాఖలు చేసి ఎండగడతాం” అని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలే: మాణిక్ ఠాక్రే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేండ్లవుతున్నా ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే మండిపడ్డారు. అబద్ధపు హామీలతో పదేండ్లుగా టైంపాస్ చేస్తున్నారని ఆరోపించారు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ హామీలు గుప్పిస్తారని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే లాభపడిందని ప్రజలు గుర్తించారు. రాష్ట్రాన్ని ఈ పదేండ్లు కేసీఆర్ దోచుకున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తాం” అని స్పష్టం చేశారు.
బీసీలను మోసం చేసే యత్నం: మహేశ్ కుమార్
బీసీలను అడుగడుగునా కేసీఆర్ సర్కార్ విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘‘బీసీ కార్పొరేషన్లో 5.7 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తొమ్మిదేండ్లలో బీసీలకు ఏమీ చేయని కేసీఆర్.. ఇప్పుడు రూ.లక్ష సాయం పేరుతో ఓట్ల కోసం పథకం ప్రవేశపెట్టారు. బీసీ బంధు పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు” అని మండిపడ్డారు. దళితులను అడుగడుగునా దగా చేస్తున్నారని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఫైర్ అయ్యారు. దళితబంధు స్కీమ్‌లోనూ ఎమ్మెల్యేలు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దళితులకు న్యాయం చేయాలని పోరాడిన నేతలను చట్టసభల్లో ఉండొద్దని కేసీఆర్ కక్షగట్టారన్నారు.
మైనారిటీల రిజర్వేషన్లు మరిచారు: షబ్బీర్ అలీ
మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలును సీఎం కేసీఆర్ మరిచిపోయారని షబ్బీర్ అలీ ఆరోపించారు. తొమ్మిదేండ్లుగా మైనారిటీలను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారన్నారు. విద్య, పథకాలు అన్ని విషయాల్లోనూ ముస్లింలు అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక లక్ష మందికిపైగా ముస్లిం విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలేస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మంత్రి వక్ఫ్ భూములను అమ్మేస్తున్నారని ఆరోపించారు.
2 ప్రభుత్వాలు తోడు దొంగలు: సంపత్ కుమార్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తొమ్మిదన్నరేండ్లుగా మభ్యపెడుతున్నాయని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని, దానిపై రాష్ట్రం కనీసం పోరాడలేదని అన్నారు. రెండు ప్రభుత్వాలు తోడు దొంగలన్నారు. మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ అప్పులపాలు చేసిందని ఆరోపించారు.
ఆకాంక్షలు నెరవేరలే: కంచ ఐలయ్య
ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారో. అవి నెరవేరలేదని ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచ ఐలయ్య ‘తీర్పు’ చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆరే సీఎం అయ్యారని, రాబోయే రోజుల్లో ఆయన కుటుంబం నుంచే సీఎం అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. వ్యవసాయం, రైతులు, విద్యా వ్యవస్థ సహా అన్నింటినీ సర్కారు నిర్లక్ష్యం చేసిందన్నారు. భూముల ధరలు పెరగడం సామాన్యుడికి పెద్ద దెబ్బ అన్నారు. ప్రభుత్వాలు భూముల ధరలు పెరగకుండా చూడాలేగానీ.. ధరలను పెంచేలా చేసి అదే అభివృద్ధి అని అనడం సరికాదన్నారు.
నెల రోజులు ‘తిరగబడదాం.. తరిమికొడదాం’
‘తిరగబడదాం తరిమికొడదాం’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అన్ని గ్రామాల్లోనూ ‘ప్రజాకోర్టు’ పేరిట జన సభలు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనుంది. ఈ నెల రోజుల్లో 75 లక్షల కుటుంబాలను కలిసేలా పార్టీ నాయకత్వం కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. 3 వేల డివిజన్లు..12 వేల పంచాయతీల్లో ప్రతి రోజూ ప్రజాకోర్టు నిర్వహించి ఎమ్మెల్యేలపై ప్రజా చార్జిషీట్లను విడుదల చేయనుంది. పోస్ట్ కార్డు, మిస్డ్ కాల్ ఉద్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాలని నిర్ణయించింది. మిస్డ్ కాల్ ఉద్యమం కోసం 7661899899 ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్, జర్నలిస్ట్ జహీర్ అలీ ఖాన్‌కు నివాళులర్పించారు. నేతలు పొన్నం ప్రభాకర్, సీతక్క, సురేశ్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆ నినాదం ప్రజలకు దూరమైంది: భట్టి
కేసీఆర్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదం ప్రజలకు దూరమైపోయిందని, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ‘పోరాడదాం.. తిరగబడదాం.. తరమికొడదాం.. రాష్ట్రాన్ని నిలబెడదాం’ అని పిలుపునిచ్చారు. గద్దర్ లాంటి వాళ్లు శకానికొక్కరే పుడతారని కొనియాడారు. గొంతెత్తి ఆడిపాడి ప్రజలను చైతన్య పరిచాన్నారు.