లెదర్ పార్కును వెంటనే పునరుద్ధరించాలి

లెదర్ పార్కును వెంటనే పునరుద్ధరించాలి
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా: ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల అభివృద్ధినే మర్చిపోయిండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మందమర్రిలో అసంపూర్తిగా ఉన్న లెదర్ పార్క్ ను  ప్రారంభిస్తామని చెప్పి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. మందమర్రిలో అసంపూర్తిగా ఉన్న లెదర్ పార్క్ ను మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. 
అనంతరం వివేక్ వెంకటస్వామిని దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ  సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ లెదర్ పార్కును వెంటనే పునరుద్ధరించి దళితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 2009లో దళితులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా నాన్న  కాకా వెంకటస్వామి లెదర్ పార్క్ ఏర్పాటు కు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. 
2018 ఎన్నికల ప్రచారం సమయంలో మందమర్రి వచ్చిన సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు లెదర్ పార్కు ను అందుబాటులో కి తీసుకువస్తామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని, ప్రతి దళితునికి మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. లెదర్ పార్కుకు నిధులు ఇప్పించే విషయాన్ని కేంద్రం దృష్ఠికి తీసుకువెళ్తానని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.