గిరిజనులు కబ్జా కోరులా కేసీఆర్. ?: షర్మిల

గిరిజనులు కబ్జా కోరులా కేసీఆర్. ?:  షర్మిల

కేసీఅర్ వెన్నుపోటు దారుడని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మిమ్మల్ని మించిన మోసగాడు ఎవరూ లేరని ఆరోపించారు. హామీలు ఇచ్చి మోసం చేయడం కేసీఆర్ కు అలవాటేనని, అన్నీ చేతగాని వాగ్ధానాలు చేశారని షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఎనిమిదిన్నరేళ్లయినా ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇవ్వలేదని ఆరోపించారు. 2018 లో ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని మండిపడ్డారు. 2019 అసెంబ్లీలో ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు హక్కు ఉందన్నారు. అవి అడవి బిడ్డల జన్మ హక్కు అని అన్నారు. 6 నెలల్లో ఇస్తామని 4 ఏళ్లు దాటినా పట్టాలు ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. పట్టాలు ఇవ్వక పోగా లక్షల ఎకరాల్లో ట్రెంచ్ లు వేశారని, మొక్కలు నాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య ఉందని కేసీఅర్ కు తెలుసు..  అయినా గిరిజన బిడ్డలను అరిగొస పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది మీద కేసులు పెట్టారని, లాఠీ ఛార్జ్ లు చేశారన్నారు. చంటి బిడ్డలని కూడా చూడకుండా మహిళలను కూడా జైల్లో పెట్టారని ఆరోపించారు. జైళ్లో మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా నరకం చూపించారని చెప్పారు. 

నిన్న కేసీఅర్ అసెంబ్లీలో అడవి బిడ్డల గురించి నీచంగా మాట్లాడారని షర్మి్ల ఆరోపించారు. గిరిజనులను కించపరిచారని, ఆదివాసీలు భూఅక్రమాలను చేస్తున్నట్లు మాట్లాడారని చెప్పారు. గిరిజనులను కబ్జా కోరాలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.  అధికారులను చంపడం ఎవరూ సమర్థించరన్న షర్మిల.. కానీ ఆదివాసీలను ఎంత మందిని కొట్టారు..? వాళ్ళను ఎన్ని చిత్ర హింసలకు గురి చేశారు ..? అని నిలదీశారు. ఆదివాసీ బిడ్డలను కేసీఅర్ అవమానించారని షర్మిల ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాటలు మార్చడం తగదన్నారు. ఆదివాసీలకు ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తామని కేసీఆరే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఅర్ మాటలు దొరను, నియంతను తలపిస్తున్నాయన్న ఆమె.. ఆదివాసీలు భూములు అడగడం న్యాయం కాదు అని ఎలా అంటారని ప్రశ్నించారు.

ఆదివాసీలు దురాక్రమ దారులు అని మాట్లాడుతున్నారు... మరి మీరేంటీ కేసీఅర్ గారు అని షర్మిల ప్రశ్నించారు. ధరణి పథకం పెట్టి తెలంగాణలో మీ కుటుంబం లక్షల ఎకరాలు దురాక్రమణ చేసిందని ఆరోపించారు. భూఆక్రమణలు, కబ్జాలకు పాల్పడింది మీరు అని విమర్శించారు. తెలంగాణ ఆస్తులను మీరే అమ్ముతున్నారని, ఆ అమ్మే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? అని నిలదీశారు. రాజీవ్ స్వగృహ భూములు మీరు అమ్మడం లేదా..? ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. మీకు పోడు పట్టాలు ఇవ్వాలన్న చిత్త శుద్ది లేదు అని షర్మిల మండిపడ్డారు. 

పోడు పట్టాలు ఇవ్వడానికి ఇన్ని షరతులు ఎందుకు..?- మీ ఆస్తులు ఇస్తున్నారా...?- మీ ఫామ్ హౌజ్ ఇస్తున్నారా..? అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములు గిరిజనుల ఆస్తులని.. వారికి భేషరతుగా పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ప్రజలు మీకు రాసి ఇవ్వలేదన్న షర్మిల.. మీరు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పట్టాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎటువంటి కండీషన్ లు ఉండొద్దని, ఆదివాసీల మీద పెట్టిన కేసులన్నీ విత్ డ్రా తీసుకోవాలని కోరారు.