వైజాగ్​లో కేసీఆర్ సభ!

వైజాగ్​లో కేసీఆర్ సభ!

హైదరాబాద్, వెలుగు: వైజాగ్​లో బీఆర్​ఎస్​ భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ​ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్​ స్టీల్​ ప్లాంట్ ​ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు సంఘీభావంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ​వర్గాలు చెప్తున్నాయి. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో బీఆర్ఎస్​ ఏపీ శాఖ భాగస్వామ్యం అయ్యింది. కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని ప్రభుత్వరంగ సంస్థలను తన కార్పొరేట్ ​మిత్రులకు అప్పనంగా కట్టబెడుతోందని కేసీఆర్​పలు వేదికలపై మండిపడ్డారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో బీఆర్ఎస్ ​కార్మిక విభాగం పాలు పంచుకుంది.

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్​ బహిరంగ సభ తర్వాతే వైజాగ్​లో పార్టీ బహిరంగ సభకు ప్లాన్ ​చేసినా.. తర్వాత ఆ ఊసు ఎత్తలేదు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్..​ నాందేడ్​ జిల్లాలో సభలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైజాగ్​ స్టీల్ ​ప్లాంట్​ ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఏపీలో బీఆర్ఎస్​ ప్రస్థానం షురూ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ పార్టీ చీఫ్​ తోట చంద్రశేఖర్,​​ఇతర నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే కేసీఆర్  ​సభ ఉండే అవకాశముందని నేతలు చెప్తున్నారు.

ఏపీ ప్రజలు, కార్మికుల మద్దతు కూడగట్టేందుకే

వైజాగ్ స్టీల్ ​ప్లాంట్​ కార్మికులకు మద్దతుగా భారీ బహిరంగ సభ పెట్టి కార్మికులతో పాటు ఏపీ ప్రజల మద్దతు కూడగట్టాలనే ఆలోచనలో కేసీఆర్​ఉన్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్​ పార్టీ బీఆర్ఎస్​గా మారిన తర్వాత కేసీఆర్​ ఏపీపైనే ఫోకస్ ​పెట్టారు. పలువురు నాయకులను చేర్చుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సిట్టింగ్​ఎమ్మెల్యేలు తనతో టచ్​లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే, దీనికి ఏపీ ఎమ్మెల్యేలు, ఇతర లీడర్ల నుంచి రెస్పాన్స్​ రాలేదు. ఏపీలో జనసేన చీఫ్ ​పవన్​కల్యాణ్​తో బీఆర్ఎస్​ కలిసి పనిచేయబోతోందనే ప్రచారం సాగినా అది నిలువలేదు. దీంతో కేసీఆర్ ​ఏపీలో పార్టీ విస్తరణ ప్రయత్నాలను తగ్గించారనే ప్రచారమూ జరిగింది. అయితే, ఇప్పుడు ఏపీలో పార్టీ విస్తరణ చేయాలనే ఆలోచనలో కేసీఆర్​ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గద్వాల జిల్లాతో పాటు ఏపీలోని ఉమ్మడి కర్నూల్​ జిల్లాలో ప్రభావం చూపగల చల్లా వెంకట్రామిరెడ్డికి అందుకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్తున్నారు. 

మహారాష్ట్ర రైతు నేతలతో లంచ్ ​మీటింగ్

మహారాష్ట్ర రైతు నేతలతో కేసీఆర్ ​సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ప్రగతి భవన్​లో వారితో కలిసి లంచ్​ చేశారు. వాళ్లు సందర్శించి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి ఆలయం ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేస్తోంది.. వాటిని ప్రవేశ పెట్టడానికి దారితీసిన పరిస్థితులను వారికి వివరించారు.