
పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడి అమలు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రడ్డి. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో తాము త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. కేసీఆర్ తప్పుచేసి ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టారు.
దాన్ని మళ్ళీ నిర్మించాల్సిందేనని అన్నారు. సింగరేణి పరిధిలోని గనులను ప్రైవేటు వ్యక్తులకు వేలం వేయడం సరికాదన్నారు. ఇది పరోక్షంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయడమేనని తెలిపారు. మోదీ అబద్దాలకోరని విమర్శించారు. రైతు రుణమాఫీని స్వాగతిస్తున్నామని కాకపోతే ఇబ్బందులు, షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని అన్నారు.
Also Read:పోలీసుల డీపీ ఫొటోలతో ఫేక్ కాల్స్ చేస్తారు.. జాగ్రత్తగా ఉండండి: డీజీపీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధు స్థానంలో 15వేల రూపాయలు చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని సూచించారు. పదేళ్లుగా రేషన్ కార్డు లేక పేదలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని కోరారు. కలెక్టర్లు ఏసీ గదులు వదిలేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్న రేవంత్ రెడ్డి పిలుపును స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ తీర్చేలా ఈ ప్రభుత్వం పని చేయాలన్నారు చాడ వెంకట్ రెడ్డి.