దేశ రాజకీయాల్లోకి కేసీఆర్​ వెళ్లకపోవచ్చు

దేశ రాజకీయాల్లోకి కేసీఆర్​ వెళ్లకపోవచ్చు
  • వరదలపై రాజకీయం మంచిదికాదు
  • ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించడం నా బాధ్యత
  • ప్రగతి భవన్ - రాజ్​భవన్ మధ్య గ్యాప్  ఓపెన్ సీక్రెట్
  • సీఎంను కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్  అమలైతలేదు
  • డబుల్ బెడ్రూం ఇండ్ల అమలు తీరుపై జనంలో వ్యతిరేకత ఉంది
  • రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని వెల్లడి
  • ఢిల్లీలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులే ఇందుకు కారణం కావొచ్చని గవర్నర్​ తమిళిసై అభిప్రాయపడ్డారు. వరదలపై రాజకీయం చేయడం మంచిదికాదని, ప్రజలు వరదలతో అల్లాడుతుంటే స్పందించడం తన బాధ్యత అని చెప్పారు. గవర్నర్ అంటే కేవలం రాజ్ భవన్ గోడలకే పరిమితం కావాలన్న ఉద్దేశం సరికాదన్నారు. ‘‘నేను ఎప్పటికీ ప్రజల వెంటే ఉంటాను. రాష్ట్రంలో ఇటీవల వరదలు వచ్చినప్పుడు వెళ్లి ప్రజలను కలిసి వారి ఇబ్బందులపై దృష్టి సారించాను. నేను వివాదాస్పదంగా ఉండాలనుకోను. ఎప్పటికీ నిర్మాణాత్మకంగానే ఉండాలనుకుంటున్నాను. అందుకే నా విధులను నేను నిర్వర్తిస్తున్నాను” అని గవర్నర్​ స్పష్టం చేశారు.  సోమవారం పార్లమెంట్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్​ తమిళిసై పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ కు వచ్చారు.  ఈ సందర్భంగా ప్రెస్​మీట్​లో, మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ రావాలని భావిస్తున్నారని, అందుకే ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘అయితే, కేసీఆర్ మనసులో ఏముందో చెప్పలేం. నా వ్యక్తిగత అభిప్రాయం వరకు దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లరు. వెళ్లే అవకాశం లేదు” అని గవర్నర్​ అన్నారు. 

క్లౌడ్​ బరస్ట్​ సాంకేతికంగా సాధ్యం కాదు

తనకున్న సమాచారం ప్రకారం క్లౌడ్ బరస్ట్  సాంకేతికంగా సాధ్యం కాదని గవర్నర్​ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సైంటిఫిక్ రిపోర్ట్స్ లేవన్నారు.  భారీ వరదలు, ప్రవాహాలు కేవలం తెలంగాణలోనే కాకుండా, యానంలో కూడా వచ్చాయని తెలిపారు. ఇది సహజ కారణాల వల్లే జరిగిందన్నారు. క్లౌడ్ బరస్ట్, ఇతర అనేక అంశాలపై తాను మాటి మాటికి బరస్ట్ కాలేనని, అన్ని విషయాలు ప్రజల ముందున్నాయని పేర్కొన్నారు. 

ఓపెన్​ సీక్రెట్​.. కొత్తదనం ఏమీ లేదు

హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం లేకుంటే .. రాజ్ భవన్​కు సీఎం కేసీఆర్​ వచ్చే వారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ప్రగతి భవన్ ..రాజ్​భవన్ మధ్య గ్యాప్ ఇప్పుడూ  ఓపెన్ సీక్రెట్. దాంట్లో కొత్తదనం ఏమీ లేదు” అని గవర్నర్​ అన్నారు. రాజ్ భవన్ లో సీఎంను కలిసిన తర్వాత కూడా  ప్రొటోకాల్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తాను వరదల సమయంలో పర్యటించినప్పుడు కలెక్టర్లు కూడా రాలేదని చెప్పారు.  

ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించడం నా బాధ్యత

ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తనను పోల్చవద్దని, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే స్పందించడం తన బాధ్యత అని గవర్నర్​ తమిళిసై  చెప్పారు. భద్రాచలం ప్రాంతంలో తాను దత్తత తీసుకున్న కొన్ని గ్రామాల్లో గిరిజన ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని తెలిసి అక్కడికి వెళ్లానని గుర్తు చేశారు. ‘‘నా పర్యటన ద్వారా వరద బాధితులకు నైతిక స్థైర్యం రావడంతోపాటు, రాష్ట్ర గవర్నర్‌‌ క్షేత్రస్థాయిలో పర్యటిస్తోందని మరికొంత మంది సహాయం చేసేందుకు ముందుకు వస్తారని మాత్రమే అనుకున్న. అంతే తప్ప భద్రాచలం ప్రాంతంలో నా పర్యటనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు” అని స్పష్టం చేశారు. తాను ప్రజలతో ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటానని, తాను వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.  

డబుల్ బెడ్రూం ఇండ్ల అమలు తీరుపై వ్యతిరేకత 

డబుల్ బెడ్రూం ఇండ్ల అమలు తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని గవర్నర్ తెలిపారు. వరద ప్రాంతాల్లో తన విజిట్ సందర్భంగా.. వచ్చింది ఎమ్మెల్యే, ఎంపీ అనుకొని చాలా మంది డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఆందోళన చేశారని చెప్పారు. ఆ తర్వాత తాను గవర్నర్ అని తెలిసి శాంతించారని అన్నారు. ఇటీవల తాను ప్ర యాణం చేసిన విమానంలో ఒక వ్యక్తికి ప్రథమ చికి త్స అందించానని చెప్పారు. కనీసం ఎయిర్​ హోస్టెస్​కు ప్రాథమిక చికిత్స, సాధారణ పరికరాల పనితీరు కూడా తెలీదన్నారు.

రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేస్తున్నది

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం సపోర్ట్ చేస్తున్నదని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో భారీ మొత్తంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ హైవేలను మంజూరు చేశారని చెప్పారు. వరదల సందర్భంలో  రాష్ట్రానికి రిలీజ్ చేసిన ఫ్లడ్ ఫండ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలే  లెక్కలను విడుదల చేశారన్నారు. అలాగే, రాష్ట్రానికి బూస్ట్ ఇచ్చేలా  తెలంగాణ ఫ్రైడ్, ఇతర కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.  కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్, పేదలకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా 5 కేజీల అదనపు బియ్యం అందించిందన్నారు. అయితే.. ఏప్రిల్, మే నెలకు సంబంధించి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీం బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. విభజన హామీలపై ఇప్పటికే చాలా వరకు నెరవేరాయని, సమయానుకూలంగా అన్నీ పరిష్కారం అవుతాయన్నారు.  

దేశ మహిళలందరికీ రాష్ట్రపతి ముర్ము రోల్​ మోడల్​

రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్​ తమిళిసై అన్నారు. ‘‘అణగారిన వర్గాలకు చెందిన ఒక మహిళ రాష్ట్రపతి పదవిని అలంకరించడం కేవలం భారత దేశంలోనే సాధ్యం. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే ఒక వ్యక్తిని అత్యున్నత స్థానానికి ఎంపిక చేయడంతో దేశంలో గొప్ప ప్రజాస్వామ్యం ఉందని మరోసారి రుజువైంది. దేశంలోని మహిళలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోల్‌‌ మోడల్‌‌.  ఒక మహిళా గవర్నర్‌‌గా ఒక మహిళా రాష్ట్రపతి వద్ద పనిచేయడం ఒక మంచి అవకాశం. ఒక గొప్ప గౌరవం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌‌ ఎందుకు హాజరుకాలేదని మీడియా ప్రశ్నించగా.. ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదని అన్నారు. తనను ఎప్పుడు, ఎవరు ఆహ్వానించినా వారి ఆహ్వానాన్ని గౌరవిస్తానని చెప్పారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం వల్ల ప్రధాని, కేంద్ర మంత్రులు బిజీగా ఉన్నారని, వాళ్లు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు మళ్లీ వచ్చి కలుస్తానన్నారు.