అవినీతి డబ్బులతో కేసీఆర్ దేశం మీద పడ్డారు: షర్మిల

అవినీతి డబ్బులతో కేసీఆర్ దేశం మీద పడ్డారు: షర్మిల

కామారెడ్డి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ 70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అవినీతితో బాగా డబ్బులు సంపాదించిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశం మీద పడ్డారని విమర్శించారు. షర్మిల చేస్తున్న పాదయాత్ర ఇవాళ బాన్సువాడ నియోజక వర్గంలోని బీర్కుర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జనంతో మాటా ముచ్చట నిర్వహించిన అనంతరం కూడలి ప్రాంతంలో జనాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

కేసీఆర్ ప్రకటించిన సంక్షేమ పథకాల్లో ఒక్కటైనా సక్కగా అమలు చేశారా ? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ కి అసలు పరిపాలన చేతకాదు, పథకాలు అమలు చేయడం అంతకన్నా చేతకాదన్నారు. ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తే ఎలా? రాష్ట్రంలో 13 లక్షల కొత్త పెన్షన్లు పెండింగులో ఉన్నాయి.. అసెంబ్లీ సాక్షిగా 10 లక్షల మందికి ఇస్తా అని మోసం చేశారని.. అన్ని పథకాలకు గుండు సున్నా పెట్టి ఆయన మాత్రం బాగా సంపాదించాడన్నారు. 

కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి గానీ.. చేతలు గడప దాటవని.. ఎన్నికలప్పుడే బయటకు వచ్చే కేసీఆర్  ఇప్పుడు మొత్తం మంత్రులను,ఎమ్మెల్యే లను మునుగోడు రంగంలోకి దింపారన్నారు. పాలన పక్కన పెట్టి మునుగోడు ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు.  తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఎంత మోసం చేశాడో.. ప్రతిపక్షాలు కూడా అంతే మోసం చేశాయన్నారు.

కేసీఆర్ ను ప్రజలు ప్రశ్నించి ఉంటే.. అరాచకాలు సాగేవి కాదన్నారు. కేసీఅర్ ను ప్రశ్నించేందుకే తాము పార్టీ పెట్టామని.. వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానన్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలివ్వడమే కాదు.. భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన మీద తొలి సంతకం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.