అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు

అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు
  • ఈసారి రాష్ట్ర ఆదాయం రూ. 47,119 కోట్లు తగ్గనుంది
  • ఈ ఏడాది బడ్జెట్ లో మార్పులు, సవరణలు తప్పవ్
  • ఆర్థిక నిర్వహణ ప్లాన్ రూపొందించుకోవాలి
  • ప్రాధాన్య క్రమంలో ఖర్చులు ఉండాలి: ఫైనాన్స్ రివ్యూలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక పరిస్థితి కుదేలవటంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఆదాయం భారీగా తగ్గిందని, అందుకు తగ్గట్టు ఆర్థిక నిర్వహణ ప్లాన్​ను ​మార్చుకోవాలని ఆఫీసర్లకు సీఎం కేసీఆర్​ సూచించారు. ప్రాధాన్య క్రమంలో ఖర్చులను తగ్గించాలని ఆదేశించారు. ముందుగా వేసుకున్న బడ్జెట్​ అంచనాలకు సవరణలు తప్పవన్నారు. కరోనాతో ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తంగా రూ. 47,119 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన శనివారం ప్రగతి భవన్ లో ఆర్థిక శాఖ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. 2020–-21 బడ్జెట్​పై సమీక్ష నిర్వహించారు. ఆదాయంలో భారీ తగ్గుదల ఉన్నందున బడ్జెట్ అంచనాల్లో మార్పులు, సవరణల్లో అనివార్యం తప్పదన్నారు. పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో రాష్ట్రానికి రూ. 39,608 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు రూ. 33,704 కోట్ల మాత్రమే వచ్చాయని సీఎం కేసీఆర్​కు ఆఫీసర్లు వివరించారు. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందనే అంచనాతో 2020–-21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించామని, కానీ కరోనా వల్ల 15 శాతం పెరగకపోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈసారి రాలేదని చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర ఆదాయం రూ. 1,15,900 కోట్లు వస్తుందనే అంచనాతో బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేశామని, కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 68,781 కోట్లు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా తగ్గిందని చెప్పారు. బడ్జెట్​లో ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాల్సి ఉండగా.. 6,339 కోట్లు వచ్చాయని ఆఫీసర్లు అన్నారు. ఇప్పటికే రూ. 2,025 కోట్లు తగ్గాయని, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 16,727 కోట్లకు గాను కేవలం 11,898 కోట్లు వచ్చే చాన్స్​ ఉందని చెప్పారు. దీంతో పన్నుల్లో వాటా రూ. 4,829 కోట్లు తగ్గనున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే స్కీమ్ లకు అక్టోబర్ వరకు రూ. 5,673 కోట్లు రావాలని, కానీ ఇప్పటి వరకు రూ. 4,592 కోట్లు వచ్చాయని, రూ.1,081 కోట్లు కోత పడిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.9,725 కోట్ల గాను, రూ. 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని, మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ. 802 కోట్లు కోత పడే అవకాశం ఉందని సీఎంకు ఆఫీసర్లు వివరించారు.