ఎన్ని కోట్లయినా ఖర్చు పెడ్తం..అవసరమైతే అప్పు తెస్తం

ఎన్ని కోట్లయినా ఖర్చు పెడ్తం..అవసరమైతే అప్పు తెస్తం
  • టెస్టుల కోసం వచ్చినవాళ్లలో ఒక్కర్ని కూడా వెనక్కి పంపొద్దు
  • 50 లక్షల టెస్టింగ్​ కిట్లు రెడీ చేసుకోవాలి..ఫీవర్​ సర్వేను కొనసాగించాలి
  • బ్లాక్​ ఫంగస్  కోసం 1500 బెడ్లు సిద్ధం చేయాలి..జిల్లాల్లోనూ ట్రీట్​మెంట్​ ఇవ్వాలి
  • లాక్‌‌డౌన్‌‌తో ఖర్చులు తగ్గే శాఖలను గుర్తించి, పోలీస్‌‌, హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌కు బడ్జెట్‌‌ను పెంచాలి
  • సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం

 హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడి కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతామని, అవసరమైతే అప్పులు తెచ్చేందుకు కూడా రెడీగా ఉన్నామని సీఎం కేసీఆర్  చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్‌‌తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో ఉందన్నారు. లాక్‌‌డౌన్‌‌తో ఖర్చులు తగ్గే శాఖలను గుర్తించి, పోలీస్‌‌, హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌కు బడ్జెట్‌‌ను పెంచాలని మంత్రి హరీశ్‌‌రావును ఆదేశించారు. కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, లాక్ డౌన్  అమలుపై సోమవారం ప్రగతిభవన్‌‌లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్‌‌రావు, సీఎస్ సోమేశ్‌‌కుమార్, డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం కరోనాను కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత మరోటి లేదు. ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే అప్పు తెచ్చయినా కరోనాను కట్టడి చేస్తం’’ అని అన్నారు. ఫీవర్ సర్వేను కొనసాగిస్తూనే, టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. టెస్టుల కోసం వచ్చిన వాళ్లలో ఒక్కరిని కూడా వెనక్కి పంపొద్దన్నారు. రోజుకు ఇన్ని టెస్టులే చేస్తామన్న నిబంధనలను  ఎత్తేయాలని ఆదేశించారు. ఇందుకు తగ్గట్టు 50 లక్షల టెస్టింగ్ కిట్లు సమాకూర్చుకోవాలని, మంగళవారం నుంచే అన్ని పీహెచ్‌‌సీలకూ సరిపడా కిట్లను పంపించాలన్నారు. 

‘‘కరోనా టెస్టుల కోసం వచ్చేవాళ్లంతా నిరుపేదలే ఉంటారు. వాళ్లలో ఎవరికీ టెస్టులు నిరాకరించొద్దు. జ్వరం సర్వే ద్వారా, టెస్టుల ద్వారా కిట్లను పంపిణీ చేస్తూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలి” అని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. కరోనా తగ్గుతున్నా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా లాక్‌‌‌‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఆపద సమయంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని ఆయన అన్నారు.  

బ్లాక్‌‌‌‌ ఫంగస్ పేషెంట్ల కోసం బెడ్లు పెంచాలి

బ్లాక్ ఫంగస్  పేషెంట్ల కోసం హైదరాబాద్‌‌‌‌లో 1,100, జిల్లాల్లో 400 బెడ్లను సిద్ధం చేయాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. ఇప్పటికీ గాంధీ హాస్పిటల్​లో 150, కోఠి ఈఎన్టీ దవాఖానలో 250 బెడ్లను కేటాయించినట్టు ఆయనకు ఆఫీసర్లు వివరించారు. సరోజినీదేవి హాస్పిటల్‌‌‌‌లో 200, గాంధీ హాస్పిటల్​లో ఇంకో 160 బెడ్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో గుర్తించాలన్నారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వాడే మెడిసిన్ కోసం వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘పోసకోనజోల్’ మెడిసిన్‌‌‌‌ కొని పెట్టుకోవాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలన్నారు. ‘‘మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి అటు కరోనా, ఇటు బ్లాక్ ఫంగస్  ట్రీట్​మెంట్​ కోసం తరలి వస్తున్నారు.  రాష్ట్ర జనాభా 4 కోట్లు వాస్తవమే. అయితే.. కరోనా ట్రీట్​మెంట్​ విషయంలో 4 కోట్లుగా కాకుండా అది 10 కోట్లుగా అంచనా వేసుకోవాలి. మనకు  ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వాళ్లకు కూడా ట్రీట్​మెంట్​ అందజేయంది తప్పేట్టు లేదు’’ అని సీఎం పేర్కొన్నారు. 

ఢిల్లీ, మహారాష్ట్ర మంచిగ చేస్తున్నయ్​..

కరోనా కట్టడిలో సక్సెస్ అయిన ఢిల్లీ, మహారాష్ట్రలో పాటించిన పద్ధతులపై స్టడీ చేయాలి. అవసరమైతే అక్కడికి హెల్త్ టీమ్స్ వెళ్లి పరిశీలించి రావాలి. ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతంగా  కరోనాను కంట్రోల్​ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మహారాష్ట్ర కూడా కరోనా కట్టడిలో సత్ఫలితాలను సాధిస్తున్నది. ఇంకా ఏయే రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నయో, అందుకు వారు అమలు చేస్తున్న యాక్షన్​ ప్లాన్​ ఏంటో తెలుసుకోండి. మన దగ్గర కూడా కరోనా కంట్రోల్​లోనే ఉన్నప్పటికీ, పాజిటివిటీ రేట్ ఐదు శాతం కంటే తగ్గితేనే విజయం సాధించినోళ్లం అయితం.  – సీఎం కేసీఆర్​