కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ నుంచి కేసీఆర్ సుపారీ  తీసుకున్నారని ఆరోపించారు. భువనగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, జహీరాబాద్,  మల్కాజ్‌గిరిలో బీజేపీని గెలిపించేందుకు ట్రై చేస్తున్నారని చెప్పారు. ప్రధానిగా మోదీ వచ్చి సిలిండర్ ను రూ.12 వందలు చేశారని విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాని ఇంటికి కరెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతి గ్రామాన ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కేసీఆర్ ఊరించి..ఊరించి ఊరవుతల ఇండ్లు కట్టి ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 

బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అంటున్నారని ఎందుకు ఓడించాలో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ విద్వాంసాలు సృష్టించారని అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఇదేమైన రాచరికపు వ్యవస్థనా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డలు ముఖ్యమంత్రులు కావద్దా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.