టీఆర్​ఎస్​, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్​

టీఆర్​ఎస్​, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్​
  • యూపీఏను చీల్చడమే కేసీఆర్‌‌ ఎజెండా
  • ఆయన చంద్రమండలంలోనూ పార్టీ పెట్టుకోవచ్చు: రేవంత్​
  • టీఆర్​ఎస్​, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్​
  • నిరుద్యోగుల చావులకు కారణమైన టీఆర్‌‌ఎస్​ను ఉరివేసినా తప్పులేదు
  • కు.ని. ఆపరేషన్లు ఫెయిలై 
  • మహిళలు చనిపోతుంటే పట్టదా? 
  • లిక్కర్​ స్కామ్​లో కవిత ఇంట్లో ఎందుకు సోదాలు చేస్తలే అని నిలదీత
  • ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్​ సర్వనాశనం చేసిండు: ఉత్తమ్​

హైదరాబాద్‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌తో కలిసి పనిచేస్తున్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ యూపీఏను చీల్చడమే కేసీఆర్ ఎజెండాగా పెట్టుకున్నారని పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉన్న ఏ ఒక్క పార్టీ అధినేతను కూడా కేసీఆర్‌‌ ఇంతవరకు కలువలేదని,  పక్కనే ఉన్న జగన్‌‌తోనూ ఇప్పటి వరకు సంప్రదింపులు జరపలేదన్నారు. బీజేపీకి లాభం చేయడానికే కేసీఆర్‌‌  ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్‌‌ జాతీయ పార్టీ కాదు చంద్ర మండలంలోనూ పార్టీ పెట్టుకోవచ్చు. ఆయన రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు. ఇక్కడే పనిచేయలేనోడు ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తడు?” అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికపై శనివారం గాంధీ భవన్‌‌లో కాంగ్రెస్​ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో టికెట్‌‌ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించారు.

తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడానికే టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, గవర్నర్‌‌నూ ఇందులో ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ‘‘గిరిజనుల భూములు లాక్కున్న, నిరుద్యోగుల చావులకు కారణమైన టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని ఉరివేసినా తప్పులేదు. రాష్ట్రం శవాల కుప్పగా మారడానికి టీఆర్‌‌ఎస్సే కారణం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్‌‌ అయి మహిళలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది?” అని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు– -రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్​ చేశారు. లిక్కర్ స్కాంపై బీజేపీ బుద్ధిలేని ప్రచారం చేస్తున్నదని రేవంత్​ దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇంట్లో ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మునుగోడు అభ్యర్థిగా పాల్వయి స్రవంతి పేరు ఖరారు చేశారని రేవంత్​ చెప్పారు. 

స్రవంతి గెలుపు కోసం పనిచేస్తం: ఉత్తమ్‌‌

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు కోసం అందరం పనిచేస్తామని ఎంపీ ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌‌ శ్రేణులంతా మునుగోడుకు తరలిరావాలన్నారు. 8 ఏండ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్‌‌ సర్కారుకు కాలం దగ్గర పడిందని హెచ్చరించారు.  

కాంగ్రెస్​ మునుగోడు బైపోల్‌‌ ఇన్‌‌చార్జులు వీరే..

మునుగోడు బైపోల్‌‌ ప్రచార ఇన్‌‌చార్జీలు, స్టార్‌‌ క్యాంపెయినర్లను పీసీసీ ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌‌, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌‌ రెడ్డిని నియమించింది. నాంపల్లి మండల ఇన్‌‌చార్జ్​గా దామోదర రాజనర్సింహ, సహ ఇన్‌‌చార్జులుగా అంజన్‌‌ కుమార్‌‌ యాదవ్, మల్లు రవి... చౌటుప్పల్​ మండల ఇన్‌‌చార్జ్​గా ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి, సహ ఇన్‌‌చార్జులుగా సీతక్క, విజయ రమణారావు... మర్రిగూడ  మండల ఇన్‌‌చార్జ్​గా శ్రీధర్‌‌బాబు, సహ ఇన్‌‌చార్జులుగా చెరుకు సుధాకర్‌‌, వేం నరేందర్‌‌ రెడ్డి... చండూర్‌‌  మండల ఇన్‌‌చార్జ్​గా షబ్బీర్‌‌ అలీ, సహ ఇన్​చార్జులు ఈరవత్రి అనీల్‌‌ కుమార్‌‌, చిక్కుడు వంశీకృష్ణ.. గట్టుప్పల్‌‌  మండల ఇన్‌‌చార్జ్​గా వి.హన్మంతరావు, సహ ఇన్‌‌చార్జులుగా సంపత్‌‌ కుమార్‌‌, ఆది శ్రీనివాస్‌‌... నారాయణపూర్‌‌ మండల ఇన్‌‌చార్జ్​గా రేవంత్‌‌ రెడ్డి, సహ ఇన్‌‌చార్జులుగా బలరాం నాయక్‌‌, గండ్ర సత్యనారాయణరావు.. చౌటుప్పల్ మున్సిపల్‌‌ ఇన్‌‌చార్జ్​గా గీతారెడ్డికి బాధ్యతలు అప్పగించింది.