మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోందని, ఎమర్జెన్సీని తలపించేలా కేసీఆర్‌‌‌‌ తీరు ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌‌‌‌ ఫైర్‌‌‌‌ అయ్యాడు. బండి సంజయ్​అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బుధవారం నిరసన దీక్ష చేవారు. జోగిపేటలో బాబూ మోహన్​ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. పోలీసులతోనే ప్రభుత్వం నడిపిస్తున్నారని, ప్రజలను పోలీసుల తో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా నాయకులు జగన్నాథం ఉన్నారు. సిద్దిపేటలో జరిగిన నిసన దీక్షలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు చర్చ జరుగుతుండటంతో ఆ చర్చకు పక్కదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో నాయకులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. సంగారెడ్డిలోని జిల్లా ఆఫీస్​లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అశ్వంత్ , బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు నెమలికొండ వేణుమాధవ్ , పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యరావు, జిల్లా కార్యదర్శి సారా కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కూచిని సతీశ్​ పాల్గొన్నారు. అలాగే హుస్నాబాద్, కోహెడ మండల కేంద్రాల్లో స్థానిక నాయకులు, పటాన్​చెరు లోని ఇస్నాపూర్​ చౌరస్తాలో ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటాన్​చెరు మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్​ ఆధ్వర్యంలో నిరసనగా దిష్టి బొమ్మను దహనం చేశారు. మెదక్​ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో, రామాయంపేట పట్టణంలో దీక్ష చేశారు. 

మైనింగ్​ తవ్వకాలను ఆపాలి

ఎర్దనూర్​లో పనుల్ని అడ్డుకున్న రైతులు 

కంది, వెలుగు : తమ భూములను మైనింగ్​ వాళ్లకు ఇవ్వమని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూముల్లో ఎస్​ఆర్​ మైనింగ్​ అనే కంపెనీ వాళ్లు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని మండలంలోని ఎర్దనూర్​లో రైతులు బుధవారం భూముల తవ్వకాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ మెదక్​లో సుమారు 40 మందికి పట్టాలిచ్చారని తెలిపారు. అయితే కొంతకాలం కిందట ఆ భూమిని ఎస్​ఆర్​ మైనింగ్​ కంపెనీ వారు లీజ్​కు తీసుకోవడానికి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, కాగా అందులో కొందరు రైతులు మాత్రమే ఒప్పుకున్నారని తెలిపారు. మిగతా కొంత మంది రైతులు ఒప్పుకోలేదని చెప్పారు. అయితే రెవెన్యూ ఆఫీసర్లు ఇటు మైనింగ్​ శాఖ ఆఫీసర్లు ఇష్టారీతిగా కంపెనీ వారికి హద్దులు చూపెట్టారని, వాళ్లు భూములు ఇవ్వని రైతుల భూముల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు ఈ తవ్వకాలను ఆపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై కంది మండల తహాసీల్దార్​ విజయలక్ష్మిని వివరణ కోరగా తమ సిబ్బందిని పంపి విచారణ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వినాయక చవితిని ప్రశాంతంగా జరపాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేలా పోలీసులు పీస్ కమిటీ మెంబర్లకు, మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సీపీ శ్వేత అన్నారు. వినాయక చవితి ఉత్సవాలపై పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండపాల పర్మిషన్ ఇచ్చేటప్పుడే నిర్వాహకులకు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు.అలాగే 10 రోజుల్లో పెండింగ్ ఉన్న వారెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ బెయిలబుల్​ వారెంట్స్ కు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి రివార్డ్స్ ను అందించారు. అలాగే ఆగస్టు 28న నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు దేవారెడ్డి, రమేశ్​, సతీశ్​, చీప్ సూపర్ండెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, సీఐలు బిక్షపతి, రవికుమార్, భాను
 ప్రకాష్ పాల్గొన్నారు. 

క్రీడాకారులు ఇంటర్నేషనల్​ లెవెల్​లో రాణించాలి

 మెదక్​లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్​ ప్రారంభం 

మెదక్​ టౌన్​, వెలుగు: క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి, రాష్ట్రానికి పేరు తేవాలని మంత్రి హరీశ్​ రావ్​ అన్నారు. పట్టణంలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్​ స్టేడియంలో రూ.5.70 కోట్లతో నిర్మించిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ లో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జ్యోతిని వెలిగించి 8వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టేడియం అద్భుతంగా ఉందని, ట్రాక్ మధ్యలో లాన్ తో ఉప్పల్, గచ్చిబౌలి, ఎల్.బి. స్టేడియంను తలదన్నేలా ఉందని కొనయాడారు. ఇక్కడ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా క్రీడాకారులు స్టేడియంలోని సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో ప్రతి జిల్లా నుంచి సుమారు 1,100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్​, అడిషనల్​ కలెక్టర్ ప్రతిమా సింగ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్​, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజ్, డీఈఓ రమేశ్​ పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీ పరిధి పిల్లి కొట్టాల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, పలువురు లబ్ధిదారులను గృహ ప్రవేశాలు చేయించారు. 561 మంది లబ్దిదారులకు పట్టా సర్టిఫికెట్​లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టి ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీ లు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.

ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి లోపాలూ ఉండొద్దు

సిద్దిపేట రూరల్, వెలుగు: కేసుల నమోదులో, దర్యాప్తులో ఎలాంటి లోపాలు ఉండొద్దని సీపీ శ్వేత సూచించారు. బుధవారం సీపీ ఆఫీస్ లో హుస్నాబాద్ డివిజన్ స్టేషన్ రైటర్లకు వివిధ అంశాల పై ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణా శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్ లో దరఖాస్తు నుంచి చార్జ్ షీట్ వరకు అన్ని వివరాలు పొందుపరచాలని సూచించారు. ప్రతి కేసులో స్టేషన్ రైటర్లకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, పోక్సో, , ఎస్సీ ఎస్టీ కేసులలో శిక్షల శాతం మానిటర్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, గజ్వెల్ ఏసీపీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ది పనులు స్పీడప్​ చేయాలి

సిద్దిపేట, వెలుగు: అభివృద్ధి పనులు వేగంగా చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, హరితహారం, స్టేడియం, మెగా విలేజ్​ పార్క్​ పనుల గురించి తెలుసుకున్నారు. హరితహారం మొక్కల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. మెగా విలేజ్ పార్క్​ కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలం సేకరించాలని తెలిపారు. గ్రామాల్లో స్టేడియాలు ఏర్పాటు చేసేందుకు ఎంపీడీవోల పనితీరు మెరుగు పడాలని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీఓ దేవకి దేవి, డీఎఫ్ఓ శ్రీధర్ రావు, జడ్పీ అడిషనల్ సీఈవో సుమతి పాల్గొన్నారు.

కొత్త పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి..

కొత్త పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్​ పాటిల్ ఆదేశించారు. జిల్లాలో కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ముందుగా 27 న దుబ్బాక మండల కేంద్రంలోని కోమటి రెడ్డి ఫంక్షన్ హాల్ లో, మధ్యాహ్నం 2 గంటలకు తొగుట మండల కేంద్రంలో, 28 న సిద్దిపేట అర్బన్ , సిద్దిపేట మున్సిపాలిటీ లకు సంబంధించి కొండ భూదేవి గార్డెన్స్ లో మంత్రి హరీశ్​ రావు పింఛన్లను పంపిణీ చేస్తారని తెలిపారు. పింఛన్​దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 

మన ఊరు- –మన బడి పనులను వేగవంతం చేయాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: మన ఊరు – మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, డబుల్ బెడ్ రూమ్ లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి అయిన పనులు, కొనసాగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పనుల ఆలస్యం అవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజక వర్గం లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఏ లో జరుగుతున్న స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణాల గురించి తెలుసుకున్నారు. బ్యాంక్ లింకేజీ లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఏపీఎం వెంకట్ ఈ సమీక్షల్లో అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి , డీఈవో రాజేశ్​, డీఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.