కాంగ్రెస్‌ కూటమిలోకి మీరే రాండ్రి

కాంగ్రెస్‌ కూటమిలోకి మీరే రాండ్రి
  • సీఎం కేసీఆర్ కు స్టాలిన్ సూచన, ఫెడరల్ ఫ్రంట్ పట్ల అనాసక్తి
  • ఇప్పటికే రాహుల్ పీఎం క్యాండిడేట్ ప్రతిపాదిం చామని వెల్లడి
  • ఎన్ ఏ, యూపీఏలకు మ్యాజిక్‌ ఫిగర్‌ రాదన్న కేసీఆర్‌
  • 120కి పైగా సీట్లు ప్రాంతీయ పార్టీల చేతిలోనే ఉంటాయని వివరణ
  • గంటకు పైగా ఇరువురు నేతల సమావేశం
  • రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని యూపీఏలో చేరాల్సిందిగా సీఎం కేసీఆర్‌‌ను డీఎంకే చీఫ్‌‌ స్టాలిన్‌‌ కోరినట్టు తెలిసింది. కేసీఆర్‌‌ ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తాము ఇప్పటికే కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ రాహుల్‌‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించినట్టుగా చెప్పారు. అయితే బీజేపీ, కాంగ్రెస్‌‌ల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని, ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌తో వస్తేనే రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని కేసీఆర్‌‌ అన్నట్టుగా తెలిసింది. ఆదివారం రాత్రి చెన్నై పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌‌ సోమవారం సాయంత్రం 5 గంటలకు  అల్వార్‌‌పేటలోని స్టాలిన్‌‌ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు బి.వినోద్‌‌కుమార్‌‌, సంతోష్‌‌కుమార్‌‌ ఉన్నారు. భేటీలో డీఎంకే నుంచి సీనియర్‌‌ నాయకులు దురై మురుగన్‌‌, టీఆర్‌‌ బాలు పాల్గొన్నారు. గంటకు పైగా వీరి సమావేశం జరిగింది.  ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల పోలింగ్‌‌ సరళి, ఏయే విడతలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, జాతీయ సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయన్న వివరాలపై కేసీఆర్‌‌, స్టాలిన్‌‌ చర్చించారు.

ఇదే మంచి తరుణం..

‘‘కేంద్రం అవసరానికి మించిన అధికారాలను దగ్గర పెట్టుకుంది. కాంకరెంట్‌‌ లిస్ట్‌‌లోని అంశాలు రాష్ట్రాలకు బదలాయించాలి. అందుకు ఇదే మంచి తరుణం. పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలు 150కి పైగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. అందులో 120 సీట్లు మన చేతిలోనే ఉన్నయి. మనమంతా ఒక్కటిగా నిలబడితే ఆర్థికంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. దేశంలో ఉన్న వనరులు, విద్యుత్‌‌ను బీజేపీ, కాంగ్రెస్‌‌ ఉపయోగించలేకపోయాయి. మనపై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉంటే వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు’’ అని కేసీఆర్‌‌.. స్టాలిన్‌‌తో అన్నట్టు తెలిసింది. సింగిల్‌‌ లార్జెస్ట్‌‌ పార్టీగా బీజేపీ నిలిచినా ఎన్‌‌డీఏ భాగస్వామ్య పక్షాలు పెద్దగా సీట్లు గెలిచే అవకాశం లేదని, కాంగ్రెస్‌‌కు సొంతగా 120కి మించి సీట్లు రాకపోవచ్చని అన్నారు. టీఆర్‌‌ఎస్‌‌, వైసీపీ, డీఎంకే, బీజేడీ, టీఎంసీ, సమాజ్‌‌వాదీ పార్టీలు 120కిపైగా సీట్లు గెలుస్తాయని, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలనేది ఈ పార్టీలే నిర్ణయిస్తాయని అన్నట్టు సమాచారం. మమతా బెనర్జీని మోడీకి దీటైన ప్రత్యర్థిగా ఫోకస్‌‌ చేసే  విషయంలోనూ చర్చ జరిగింది. ‘మాయావతి సైతం ప్రధాని పీఠం ఆశిస్తున్నా మమతకే ఎక్కువ పార్టీల మద్దతు దక్కే అవకాశం ఉంది. అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే రాష్ట్రాల హక్కులు సాధించుకోవడంతో పాటు కేంద్ర నామినేటెడ్‌‌‌‌ పోస్టుల్లోనూ వాటా దక్కించుకోవచ్చు. యూపీఏ–2లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తక్కువ సీట్లు గెలిచినా ఆ పార్టీ నాయకులకే గవర్నర్‌‌‌‌, విదేశీ రాయబార పోస్టులు దక్కాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఒక్కటిగా ఉంటే ఆ పోస్టుల్లో మనవాళ్లకు అవకాశం దక్కుతుంది. కేవలం కేబినెట్‌‌‌‌ బెర్త్‌‌‌‌ల కోసం బేరాలాడితే రాష్ట్రాల ప్రయోజనాలు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది’ అని అన్నట్టు తెలిసింది.

జాతీయ పార్టీలే మన దగ్గరికి రావాలె

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వం నడుచుకుంటోందని, గతంలో కాంగ్రెస్‌‌‌‌ అలాగే వ్యవహరించిందని కేసీఆర్‌‌‌‌ అన్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలకు ఈ ఎన్నికల ద్వారా మంచి అవకాశం దక్కిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ పార్టీల వద్దకు ప్రాంతీయ పార్టీలు వెళ్లడం కంటే, ప్రాంతీయ పార్టీల వద్దకే జాతీయ పార్టీలు వచ్చే పరిస్థితిని తేవాలని సూచించినట్టుగా సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి భేటీ అవుదామని స్టాలిన్‌‌‌‌ చెప్పినట్టుగా సమాచారం. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, కేంద్ర పన్నుల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా సాధించేలా అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కమాటపై నిలబడాలని కోరినట్టు తెలిసింది. త్వరలోనే తాను ఉత్తరాది పర్యటనకు వెళ్తున్నానని, మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతానని స్టాలిన్‌‌‌‌తో అన్నట్టు సమాచారం. భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్‌‌‌‌ రాత్రి 8 గంటల సమయంలో బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకున్నారు.

రంగనాథస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌‌‌‌

సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌‌‌‌ శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

కేసీఆర్‌‌‌‌నే కాంగ్రెస్​ కూటమిలో చేరమన్నాం: డీఎంకే

యూపీఏలో చేరాల్సిందిగా సీఎం కేసీఆర్‌‌‌‌ను డీఎంకే చీఫ్‌‌‌‌ స్టాలిన్‌‌‌‌ కోరినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏ.శరవణన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. స్టాలిన్‌‌‌‌, కేసీఆర్‌‌‌‌ భేటీ అనంతరం సోమవారం ఆయన ఈ మేరకు ట్వీట్‌‌‌‌ చేశారు. మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీకి వ్యతిరేక పంథాలోనే డీఎంకే కొనసాగుతుందని ఈ భేటీలో స్టాలిన్‌‌‌‌ స్పష్టంగా చెప్పారని, నాన్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌, నాన్‌‌‌‌ బీజేపీ కూటమి సాధ్యం కాదని ఆయన అన్నట్టుగా తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎల్లుండి బెంగళూరుకు..

మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎంకుమారస్వామితో భేటీ అయ్యేందుకు సీఎం కేసీఆర్‌ గురువారం బెంగళూరు వెళ్లనున్నట్టు తెలిసింది.గత సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ తోభేటీ అయిన కేసీఆర్‌.. ప్రాంతీయ పార్టీల కూటమికిసీపీఎం మద్దతు కోరారు. సీపీఎం ప్రధాన కార్యదర్శిసీతారాం ఏచూరితోనూ త్వరలోనే భేటీ అయ్యేఅవకాశముం ది. కర్నాటక టూర్‌ తర్వాత ఉత్తరాదిరాష్ట్రా ల పర్యటనకు సీఎం కేసీఆర్‌ వెళ్తారని టీఆర్‌ఎస్‌ వర్గా లు పేర్కొన్నాయి.