
- రెండో రోజు దొరకని ప్రధాని అపాయింట్ మెంట్
- ఇయ్యాల హైదరాబాద్ కు కేసీఆర్ తిరుగు ప్రయాణం
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో వరి సాగుపై కేంద్రంతో ఏదో ఒకటి తేల్చుకొనే వస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌కు ఎదురుచూపులు తప్పడం లేదు. వరుసగా రెండో రోజూ ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ అప్పటి నుంచి తుగ్లక్ రోడ్డులోని తన నివాసానికే పరిమితమయ్యారు. మంగళవారం కూడా అపాయింట్‌మెంట్ పై ప్రధాని ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. బుధవారం సైతం అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమేనని అంచనాకు వచ్చిన ఆయన ఇయ్యాల సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశముందని టీఆర్‌ఎస్ వర్గాలు
చెప్తున్నాయి.
అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని
రాష్ట్రంలో పండిన మొత్తం వడ్లను కేంద్రమే కొనుగోలు చేయలని, కృష్ణా, గోదావరి జలాల పునః పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునళ్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రాజెక్టులకు పర్మిషన్ పై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికే ఢిల్లీకి వెళ్తున్నానని కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ అంశాల్లో ప్రధానిపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. షెకావత్ జోధ్‌పూర్‌లో ఉండటంతో ఆయన్ను కలవడం సాధ్యం కాలేదు. ప్రధాని ఢిల్లీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ కు ఎంపీ సురేశ్ రెడ్డి విందు...
కేసీఆర్ మంగళవారం ఫిరోజ్ షా రోడ్ లోని రాజ్య సభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన ఇచ్చిన లంచ్‌కు సీఎం హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తుగ్లక్ రోడ్ లో ఆయన నివాసానికి చేరుకున్నారు.