ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు.. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్

ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు.. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక  బ్రేక్

ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తు్న్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలెర్ట్ అయింది.  ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు యాత్రను భక్తులను  అనుమతించొద్దని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి  అధికారులను  అదేశించారు. ఈ మేరకు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్‌ దీక్షిత్‌ వెల్లడించారు. దీంతో భక్తులను  సోన్‌ప్రయాగ వద్ద  నిలిపివేశారు. వారు అక్కడే ఉండేందుకు  తగిన ఏర్పాట్లను కలిపిస్తున్నారు.   

ఇవి కూడా చదవండి:  భాగమతి డైరెక్టర్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఇవాళ ఉదయం 8 గంటల వరకు 5828 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.  కేవలం రుద్రప్రయాగ, సోన్‌ప్రయాగ, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

మరోవైపు గడిచిన 24 గంటల్లో హరిద్వార్‌లో అత్యధికంగా 78 మి.మీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.  దేహ్రాదూన్‌లో 33.2 మి.మీ., ఉత్తరకాశీలో 27.7 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.