ఢిల్లీలో మళ్లీ పాగా కోసం కేజ్రీవాల్ ‘హిందూ’ పాలిటిక్స్

ఢిల్లీలో మళ్లీ పాగా కోసం కేజ్రీవాల్ ‘హిందూ’ పాలిటిక్స్
  • యాంటీ మోడీ ముద్రను వదిలించుకునే ప్రయత్నం
  • వ్యూహాత్మకంగా ఢిల్లీ సీఎం అడుగులు
  • కొత్త స్కీమ్‌‌లు  : 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్, మెట్రో రైలులో ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం, 400 యూనిట్లలోపు వాడితే 50 శాతం సబ్సిడీ, సిటీ అంతటా సీసీటీవీ కెమెరాలు,  ఫ్రీ వైఫై

న్యూఢిల్లీ:

2019 లోక్​సభ ఎన్నికల తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ దాదాపు  కష్టాల్లో కూరుకుపోయాయి. సొంత కార్యకర్తల్ని కాపాడుకోలేక కాంగ్రెస్​ విలవిల్లాడుతోంది. ఆర్టికల్​ 370, 35-ఏ రద్దుపై ఆ పార్టీ తన వాయిస్​ను బలంగా వినిపించలేకపోయింది.లెఫ్ట్​ పార్టీలదీ ఇదే సమస్య. మోడీతో ధీటుగా పోరాడుతానన్న తృణమూల్‌‌ చీఫ్​ మమతా బెనర్జీ కూడా ప్రశాంత్​ కిషోర్​ సలహాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్​) కూడా బీజేపీ బలం ముందు ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఒకప్పుడు మోడీని కొద్దోగొప్పో కలవరపెట్టిన కేజ్రీవాల్​ మొన్నటి జనరల్​ ఎలక్షన్స్​లో బేస్​ ఓటునూ కోల్పోయారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్​ సెగ్మెంట్లలోనూ ఆప్​ దారుణంగా ఓడిపోయింది. ఐదు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దిక్కులేదు.

‘సరే, మోడీ హవాలో కొట్టుకుపోయాంలే’అని అనుకోవడానికీ వీల్లేకుండా ఆప్ క్యాండేట్లకు కాంగ్రెస్​ కంటే తక్కువ ఓట్లొచ్చాయి. సీఎం కేజ్రీవాల్​ ప్రాతినిధ్యం వహించే ‘న్యూఢిల్లీ’ ఏరియాలో, డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా అన్నీ తానై వ్యవహరించిన ఈస్ట్​ ఢిల్లీ నియోజకవర్గంలో(ఆప్​ క్యాండేట్​ ఆతిషి మర్లేనా) మూడో స్థానానికి పరిమితమైపోయారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఆప్​కు 33 శాతం ఓట్లు దక్కాయి. 70 స్థానాలున్న  అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్​ ఏకంగా 54 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. అదే 2019 లోక్​సభ ఎన్నికలకొచ్చేసరికి చీపురు పార్టీ ఓటింగ్​ శాతం 18కి పడిపోగా, బీజేపీ ఓట్ల శాతం 57కు పెరిగింది. ‘‘లోక్​సభ ఎన్నికలనేవి పెద్ద పార్టీలు ‘ప్రధానమంత్రి’ పదవి కోసం తలపడేవి” అంటూ ఆప్​ అపజయం పెద్ద విషయమే కాదన్నట్లు కేజ్రీవాల్ ప్రకటనైతే చేశారుగానీ మిడిల్​క్లాస్​, ముస్లిం, దళిత వర్గాల్లో ఆప్​కు ఆదరణ తగ్గిపోవడం ఆయన్ను కలవరపెడుతూనేఉంది. కోల్పోయిన ఓట్లను తిరిగి రాబట్టుకోడానికి కేజ్రీవాల్​ దగ్గరున్న టైమ్​ ఆరునెలలే కాబట్టి కొత్త స్ట్రాటజీని చకచకా అమల్లోకి తెస్తున్నారు.

హిందూ ఐడెంటిటీని హైలైట్​ చేస్తున్నారు..

కేజ్రీవాల్​ తన ‘హిందూ’గుర్తింపును బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్​ 4న స్వామినారాయణ భగవాన్​కు అభిషేకం చేస్తున్న ఫొటోలను చక్కటి కామెంట్లతో సొంత ట్విటర్​ హ్యాండిల్​తోపాటు పార్టీ అకౌంట్​ నుంచీ ట్వీట్​ చేశారు. జులై 4న ఈద్​కు మాత్రం పొడిపొడిగా విషెస్‌​ చెప్పారు. అప్పట్లో కథువా బాలికపై హత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన కేజ్రీవాల్​..పెహ్లూఖాన్ మాబ్​లించింగ్​ కేసులో కోర్టు తీర్పుపై కనీసం స్పందిచలేదు కూడా. ఆప్​ సర్కారు ‘తీర్థయాత్రల’ పథకానికి బాగా ప్రచారం కల్పిస్తున్నారు.

జులై 20న సీఎం కేజ్రీవాల్​ స్వయంగా యాత్రికుల బృందంతో కలిసివెళ్లాల్సిఉన్నా, మాజీ సీఎం షీలా దీక్షిత్​ మరణంతో ఆ ప్రోగ్రామ్​ వాయిదా పడింది. రక్షాబంధన్​రోజునే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటన వెలువడింది. 2019 కంటే ముందు మైనార్టీలు కాంగ్రెస్​ వైపునకు మళ్లారని, ఏడాది లోపు ఆ ఫ్లో మారొచ్చని, డైనమిక్స్​ చాలా డిఫరెంట్​గా ఉండే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు కోసం కేజ్రీవాల్​ పాకులాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్కూళ్లలో దేశభక్తిని కరికులమ్​గా చేర్చడం, పేట్రియాటిజం పాఠాలు బోధించాలన్న ఆప్​ సర్కారు తాజా నిర్ణయాలూ నేషనలిజంను అడాప్ట్​ చేసుకోవడంలో భాగంగానే జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీజేపీ ప్రత్యర్థులపై ప్రయోగించే యాంటీ హిందూ లేదా యాంటీ నేషన్ ముద్ర నుంచి తనను తాను కాపాడుకోవడానికే కేజ్రీవాల్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారుతప్ప ఆప్​ రాజకీయాల్లో మార్పుగా వీటిని చూడొద్దని పొలిటికల్​ అనలిస్టు ఆశిష్ నందీ చెప్పారు. పార్టీ పుట్టినప్పటి నుంచే తనదైన సైద్ధాంతిక వైరుధ్యాన్ని నిలుపుకోడానికి ఆప్​ చాలా కష్టపడింది. కాశ్మీర్​ విషయంలో ప్రశాంత్​ భూషణ్​ను, రైట్​వింగ్ ఐడియాలజీ విషయంలో కుమార్​ విశ్వాస్​ లాంటి కీలక నేతల్ని కేజ్రీవాల్​ పోగొట్టుకున్నారు. ‘భారత్ మాతాకీ  జై’ ఇప్పటికీ వర్ధిల్లే నినాదంగా కొనసాగుతోంది. లెఫ్ట్​ పార్టీల సెక్యూలరిజం ఐడియాలజీని ఆప్​ స్వీకరించలేదు. వీటి ద్వారా కేజ్రీవాల్​ పార్టీకి కమిటెడ్​ ఓటు బ్యాంకు ఎందుకు లేదో అర్థమవుతుంది.  బీజేపీ ఒక్కటే హిందువులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ కాదని ఆయన తన ప్రచారంలో చెబుతున్నారు. కాషాయదళంతో చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో కేజ్రీవాల్​ హిందూ పాలిటిక్స్​పై ఫోకస్​ పెట్టి, హిందూ ఓట్లను రాబట్టుకునే పనిలో ఉన్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేజ్రీవాల్ పట్ల బస్తీ వాసుల్లో ఇప్పటికీ ఆదరణ ఉంది. గవర్నమెంట్​ స్కూళ్లు, మొహల్లా క్లినిక్స్​  మంచి సక్సెస్​ సాధించాయి. ఆయన తన బేస్​ ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. – జర్నలిస్ట్‌‌ నీరజ్​ చౌధురి