
కరోనా మొదలయ్యాక మాస్క్ మస్ట్ అయింది. మాస్క్ పెట్టుకొని మాట్లాడితే అవతలి వాళ్లకు ఒక్కోసారి సరిగ్గా వినిపించదు కూడా. ముఖ్యంగా డాక్టర్లు కరోనా పేషెంట్లతో మాట్లాడి, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం లేయర్డ్ మాస్క్, ఫేస్‌షీల్డ్ వల్ల కష్టంగా ఉంటుంది. డాక్టర్లకు ఈ ఇబ్బంది లేకుండా మైక్, స్పీకర్ ఉన్న మాస్క్ తయారుచేశాడు కేరళలోని త్రిస్సూర్ బీటెక్ స్టూడెంట్ కెవిన్ జాకబ్.
జాకబ్ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. మాస్క్ పెట్టుకొని కరోనా పేషెంట్లతో మాట్లాడేందుకు వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించాడు. ‘‘మా పేరెంట్స్ కొవిడ్ సోకిన వాళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు కిందటి ఏడాది నుంచి కష్టపడుతున్నారు. అప్పుడే నాకు మైక్, స్పీకర్ ఉన్న ఫేస్‌మాస్క్ తయారు చేయాలనే ఐడియా వచ్చింది. అయస్కాంతం సాయంతో మైక్, స్పీకర్‌ను మాస్క్‌కు అటాచ్ చేశాను. ఈ మాస్క్‌ను అరగంట చార్జ్ చేస్తే చాలు నాలుగు నుంచి ఆరుగంటలు పనిచేస్తుంది’’ అని చెప్పాడు జాకబ్. మొదట తన పేరెంట్స్‌కు ఈ మాస్క్ ఇచ్చి, అది చక్కగా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేశాడు. అది బాగా పనిచేయడంతో ఇప్పటివరకు 50 మాస్క్‌లు తయారుచేశాడు.
జాకబ్ తయారుచేసిన మైక్, స్పీకర్ మాస్క్ తమకు బాగా ఉపయోగపడుతోందని, కరోనా పేషెంట్స్‌తో మాట్లాడేటప్పుడు ఏ ఇబ్బంది లేదని కొందరు డాక్టర్లు ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు.
అంతేకాదు కంపెనీలు ముందుకొస్తే ఎక్కువ సంఖ్యలో ఇలాంటి మాస్క్‌లను తయారుచేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ యంగ్ ఇన్వెంటర్ జాకబ్.