కేరళ సర్కారు.. అయ్యప్ప భక్తులను పట్టించుకుంటలే : లక్ష్మణ్

కేరళ సర్కారు.. అయ్యప్ప భక్తులను పట్టించుకుంటలే :  లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లిన భక్తులకు మంచినీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్​ఎఫ్​ బలగాలను పంపించి భక్తులకు కాపాడాలని కోరారు. శబరిమలలో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని గురువారం రాజ్యసభలో లక్ష్మణ్ లేవనెత్తారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళకు చెందిన లక్షల మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే, కేరళ ప్రభుత్వం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. దాదాపు 20 గంటల పాటు దర్శనం కోసం ఎదురుచూస్తూ.. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. భక్తులపై లాఠీ చార్జ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.