కోజికోడ్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

కోజికోడ్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
  • కాంపెన్సేషన్ ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి

కేరళలోని కోజికోడ్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు కేరళ సీఎం పినరయి విజయన్. ఈ మేరకు కేరళ సీఎం కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వందే భారత్ మిషన్‌లో  భాగంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకుని వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో నిన్న రాత్రి కోజికోడ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. వర్షం కారణంగా రన్ వే స్కిడ్ కావడంతో విమానం క్రాస్ అయింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలు అయింది. ప్రమాద సమయంలో విమానంలో 190 మంది ఉండగా.. పైలట్, కోపైలట్ సహా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఒక్కరికే కరోనా పాజిటివ్

ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారందరి ట్రీట్మెంట్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మృతులతో పాటు ఫ్లైట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఒక్క బాధితుడికి మాత్రమే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు.

ఎయిరిండియా నుంచి మరో 10 లక్షల పరిహారం

విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా పరిహారం ప్రకటించింది. ఎయిర్ లైన్స్ సంస్థ ఇన్సూరెన్స్ కలిగి ఉందని, బాధితులందరికీ చట్టప్రకారం తగిన రీతిలో పరిహారం చేరేలా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తక్షణ సాయం కింద మధ్యంతరంగా 12 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న ప్యాసింజర్ మరణించి ఉంటే వారి కుటుంబానికి రూ.10 లక్షలు, 12ఏళ్ల లోపు వయసున్న వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే తీవ్రమైన గాయాలై చికిత్స పొందుతున్న వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు.