కేరళపై ప్రకృతి ప్రకోపం

కేరళపై ప్రకృతి ప్రకోపం

కేరళ రాష్ట్రంపై మరోసారి ప్రకృతి ప్రకోపం చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. విస్తారంగా పడుతున్న వానలతో భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నాయి. వరదల కారణంగా మంగళవారం మరో ఆరుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. పది జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

23 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 71 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 11 జిల్లాలకు చెందిన 2 వేల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. 9 జిల్లాల్లో NDRF బృందాలు మోహరించాయి. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. ఇడుక్కి, ముల్ల పెరియార్ డ్యామ్ లలో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. కేరళకు వచ్చే యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వర్షాల కారణంగా నేడు జరగాల్సిన కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.