కేరళ బంద్..ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

కేరళ బంద్..ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

కేరళలో పీఎఫ్ఐ బంద్పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కేరళలో అనుమతి లేకుండా బంద్కు పిలపునివ్వకూడదు. కేంద్ర ఏజెన్సీల దాడులకు వ్యతిరేకంగా కేరళలో పీఎఫ్ఐ చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తిరువనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ సభ్యులు వాహనాలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యలు దాడిలో కారు, ఆటో అద్దాలు ధ్వంసమ్యయాయి. కొల్లాంలో సెక్యూరిటీ కోసం వచ్చిన ఇద్దరు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆందోళన దృష్ట్యా మరింత ఉద్రిక్తత నెలకొనకుండా భారీగా బలగాలు మోహరించినట్లు డీజీపీ తెలిపారు. అలప్పుజా, కోజికోడ్, వయనాడ్ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులపై దాడులు జరిగాయన్నారు. 

దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆకస్మికంగా దాడులు చేసింది. 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో సోదాలు చేసి 106 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్ఐ ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళలో 22 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో పీఎఫ్ఐ సంస్థ ఛైర్మన్ సలాం కూడా ఉన్నారు. దీంతో కేరళ వ్యాప్తంగా ఆ పార్టీ సభ్యులు నిరసనలు చేపట్టారు. సాయంత్రం 6 వరకు బంద్ కొనసాగుతుందని పీఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్ తెలిపారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు.  PFI జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపి  దాడులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.