టీకా వల్ల జాబ్ కోల్పోతే.. బాధ్యత మీది కాదా?

టీకా వల్ల జాబ్ కోల్పోతే.. బాధ్యత మీది కాదా?

కొచ్చి: ప్రభుత్వం వేసిన కరోనా వ్యాక్సిన్ వల్ల సిటిజన్స్ విదేశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, అందుకు ప్రభుత్వానిది బాధ్యత కాదా? అని కేంద్ర సర్కార్ ను కేరళ హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని వ్యాక్సిన్లు వేసుకున్న సిటిజన్స్ ను విదేశాలు రానివ్వకపోవడంతో వాళ్లు తమ జాబ్స్ కోల్పోతే.. ఆ సమస్యను పరిష్కారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని అడిగింది. ప్రభుత్వం వేసిన టీకా వల్ల ప్రజలు ప్రయాణాలు చేయలేకపోవడం, జాబ్ లు కోల్పోవడం జరిగితే.. అది వాళ్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కిందికే వస్తుందని చెప్పింది. ‘‘నేను కొవాగ్జిన్ టీకా తీసుకున్నాను.

కానీ దానికి గల్ఫ్ దేశాల్లో గుర్తింపు లేకపోవడంతో తిరిగి సౌదీ అరేబియా వెళ్లలేకపోతున్నాను. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వేరే టీకా వేసుకోవడానికి అనుమతి ఇవ్వండి” అని కరోనాకు ముందు సౌదీ అరేబియాలో వెల్డర్ గా పని చేసిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ మంగళవారం విచారణ చేపట్టారు. కొవాగ్జిన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చినప్పటికీ, సౌదీ అరేబియా ఎందుకు విదేశీయులను రానివ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. సౌదీ ఆంక్షలపై పూర్తి వివరాలతో రావాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ మనూను ఆదేశించారు. విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.