ఫుల్ కాంపిటీషన్: కేరళలో విపరీతంగా పెరుగుతున్న IT ఉద్యోగులు

ఫుల్ కాంపిటీషన్: కేరళలో విపరీతంగా పెరుగుతున్న IT ఉద్యోగులు

కేరళ ఐటీ రంగంలో దూసుకుపోతోంది. గతం కంటే కేరళలో ఐటీ ఉద్యోగుల సంఖ్య గణనీయమైన వృద్దిని సాధించిందని ఇటీవల అధ్యయనంలో తేలింది. 2016 నుంచి 2023 వరకు కేరళలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 31 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో 78 వేల మంది ఐటీ ఉద్యోగులు కేరళలో పనిచేస్తుండగా... 2023 నాటికి వారి సంఖ్య 2లక్షల 50వేలకు పెరిగింది. 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్, మార్కెటింగ్ ఏజేన్సీలతో కలిసి MSME ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్తంగా చేపట్టిన కేరళ పెట్టుబడి, వృద్ది, అభివృద్ధి కి సంబంధించిన 2018-19 నుంచి 2022-23 పై అధ్యయనంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు తేలింది. ఈ లెక్కన 2025 నాటికి భారతీయ సాఫ్ట్ వేర్ ఉత్పత్తి పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఐటీ నిపుణులు. 

కేంద్ర వానిజ్య మంత్రిత్వ శాఖ 2022 ర్యాంకింగ్స్ లో రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్స్ లో కేరళ ఉత్తమ పనితీరు కనపరిచిందని గణాంకాలు చెబుతున్నాయి. 2018-19 నుంచి 2022-23 మధ్య కాలంలో కేరళ రూ. 91వేల 575 కోట్ల కొత్త  పెట్టుబడి ప్రాజెక్టులను ఆకర్షించింది. రూ. 33వేల 815 కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేసి దాదాపు 5 లక్షల మందిరకి ప్రత్యక్షంగా , పరోక్షంగా కొత్త ఉద్యోగావకాశాలను కల్పించిందని అధ్యయనం పేర్కొంది. 

భారత దేశ జనాభాలో 2.8 శాతం.. భూభాగంలో 1.2 శాతం ఉన్న కేరళ భారత జీడీపీకి నాలుగు శాతానికి పైగా సహకరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయం భారతదేశ సగటు కంటే 60 శాతం ఎక్కువ. పెద్ద సంఖ్యలో కేరళీయులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నప్పటికీ ముఖ్యంగా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం ఇది కేరళకు అంతర్గత వలసలకు ఆజ్యం పోస్తుంది. 

2021-22 ఆర్థిక సంవత్సరంలో కేరళ ఆకట్టుకునే పారిశ్రామిక వృద్ధి రేటు 17.3 శాతం నమోదు చేసింది. తయారీ రంగం వృద్ధి రేటు జాతీయ సగటు కంటే 18.9 శాతం ఎక్కువ. ఈ విషయాలు 2021-22లో రాష్ట్రం 12 శాతనికి పైగా ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంలో సహాయపడింది.