రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రోజువారీ కూలీ

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రోజువారీ కూలీ

ోరోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఘటన కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలో జరిగింది. కూలీ పనులకు వెళ్తూ.. జీవనాన్ని సాగించే పేరూన్నోన్‌ రాజన్‌ అనే వ్యక్తికి బంపర్ లాటరీలో రూ.12కోట్లు దక్కాయి.  ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని, బాధలన్నీ మరిచిపోయి  భార్యాపిల్లలను బాగా చూసుకంటానని చెబుతున్నాడు ఈ కొత్త కోటీశ్వరుడు.

రెక్కాడితేకానీ డొక్కాడని రాజన్‌ కుటుంబం.. ఒక రోజు పని మానేస్తే పూట పస్తులుండాల్సిన పరిస్థితి. కుటుంబ పోషణ కోసం అప్పులపాలైన అతడు కూలీ పనితో వచ్చిన చాలీచాలనీ డబ్బులతోనే తన  సంసారాన్ని నెట్టుకుస్తున్నాడు.  బ్యాంకుల్లో తీసుకున్న లోను కూడా  తీర్చలేకపోవడంతో బ్యాంకు వారు అతడి ఇంటిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులు కూడా ఇచ్చారు.  అయితే ఇన్ని బాధల్లోనూ ఏ రోజైనా తన దశ మారదా? అదృష్టం తన ఇంటి తలుపు తట్టిదా? అనే ఆశతో ప్రతినిత్యం లాటరీ టికెట్లు కొనేవాడు రాజన్.

తాను అనుకున్నట్టుగానే అదృష్టం అతడ్ని వరించింది. అతడు కొన్న లాటరీ టికెటుపై రూ.12 కోట్ల ప్రైజ్ మనీ తగిలింది. తిరువనంతపురంలో క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీ కింద రూ. 12 కోట్ల ఫ్రైజ్ మనీ ప్రకటించింది. తనకే బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్ కు గురయ్యారు. తనకే ఇంత పెద్ద లాటరీ వస్తుందని ఊహించలేదని రాజన్ ఉద్వేగంగా చెప్పాడు. లాటరీ వచ్చాక రాజన్ తన భార్య రజనీ, కుమారుడు రిజిల్, కుమార్తె అక్షరలతో కలిసి కన్నూర్ జిల్లా సహకార బ్యాంకుకు వచ్చి అక్కడి అధికారులకు టికెట్ అప్పగించారు.

కూతుపరంబ పట్టణంలో తాను లాటరీ టికెట్టు కొన్నానని, ముందుగా ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పాడు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో తనకు గతంలో సహాయపడిన వారికి తాను సాయం చేస్తానని చెప్పాడు. చెమట చిందించి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని వివరించాడు.

kerala-man-who-won-rs-12-crore-lottery-was-on-verge-of-his-home-being-repossessed-by-bank