తాలిబన్లకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోస్ట్.. చంపేస్తామని బెదిరింపులు

తాలిబన్లకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోస్ట్.. చంపేస్తామని బెదిరింపులు

తాలిబన్లకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన కేరళ ఎమ్మెల్యే ఎంకే మునీర్‌‌కు చంపుతామంటూ బెరింపులు వచ్చాయి. ఆ పోస్ట్‌ను డిలీట్ చేయకుంటే ప్రాణాలతో ఉండబోవంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అయితే ఆ బెదిరింపులను తాను లెక్క చేయబోనని, తన అభిప్రాయానికి తాను కట్టుబడి ఉన్నానని మునీర్ స్పష్టం చేశారు.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంకే మునీర్‌‌ ఆగస్టు 16న తాలిబన్లకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అఫ్గాన్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న తాలిబన్‌ సంస్థ తీవ్రవాద భావజాలం ఉన్న గ్రూప్‌ అని, మానవ హక్కులు లాంటివి తాలిబన్లకు పట్టవని, తీవ్రమైన వివక్షతో కూడిన రాజకీయ సిద్ధాంతాలతో నడిచే గ్రూప్‌ ఇది అని ఆయన ఫేస్‌బుక్ వాల్‌పై రాశారు. మతం పేరు చెప్పి రాడికల్ విధానాల్లో మహిళలను అణచివేస్తున్నారని, అఫ్గాన్‌లో గతంలోనూ అమానవీయ చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఉగ్రవాద, తీవ్ర వాద చర్యలను ఇస్లాం అంగీకరించదని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాలిబన్ల చర్యలను వ్యతిరేకించాలని మునీర్ పిలుపునిచ్చారు. తాలిబన్లకు వ్యతిరేకంగా, ప్రపంచమంతా అఫ్గాన్లకు అండగా నిలవాలని, ఆ దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే మునీర్ చేసిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌ నేపథ్యంలో గుర్తు తెలియని అరాచక శక్తులు ఆయనకు బెదిరింపు లేఖ పంపాయి. ఆ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించకపోతే చేతులు నరికేస్తామని, హింసించి చంపుతామని బెదిరించాయి. దీనిపై ఆయన కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు డీజీపీకి కూడా కంప్లైంట్ చేశారు. దీనిపై ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మునీర్ మాట్లాడుతూ తాలిబన్ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోబోనని, ఆ ఫేస్‌బుక్ పోస్టును డిలీట్ చేయబోనని, ఆ అరాచకవాదుల చర్యలను ఎదుర్కొనేందుకు సైతం సిద్ధమేనని చెప్పారు. ముస్లిం లీగ్‌ పార్టీ అభిప్రాయం కూడా ఇదేనని అన్నారు.

 

അങ്ങേയറ്റം രൂക്ഷമായ പ്രതിസന്ധിയിലൂടെയാണ് അഫ്ഗാൻ ജനത എന്നും കടന്നു പോയിട്ടുള്ളത്. ഇപ്പോഴിതാ അശനിപാതം പോലെ അവർക്കു മീതെ...

Posted by Dr. MK Muneer on Monday, August 16, 2021